చికెన్ అమ్మకాలు ఢమాల్
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:05 AM
బర్డ్ ఫ్లూ వైరస్.. చికెన్ ప్రియులను బాగానే భయపెడుతున్నది. ఈ ప్రభావం కోడి మాంసం విక్రయాలపై అధికంగా పడింది. ఆదివారంనాడు రద్దీగా ఉండే చికెన్ దుకాణాలు.. ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో చికెన్‌కు దూరంగా వుంటున్న మాంసాహారాలు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. చేపల ధరతో పోలిస్తే మాంసం ధర నాలుగు రెట్టు అధికంగా వుండడంతో ఎక్కువ మంది చేపల కొనుగోలుకే మొగ్గు చూపారు. దీంతో పట్టణంలోని చేపల దుకాణాలు కిటకిటలాడాయి.

బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోడిమాంసం వినియోగానికి జనం విముఖం
పదో వంతుకు పడిపోయిన అమ్మకాలు
ప్రత్యామ్నాయంగా చేపల కొనుగోలుకు ఆసక్తి
కిటకిటలాడిన చేపల దుకాణాలు
చోడవరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బర్డ్ ఫ్లూ వైరస్.. చికెన్ ప్రియులను బాగానే భయపెడుతున్నది. ఈ ప్రభావం కోడి మాంసం విక్రయాలపై అధికంగా పడింది. ఆదివారంనాడు రద్దీగా ఉండే చికెన్ దుకాణాలు.. ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో చికెన్‌కు దూరంగా వుంటున్న మాంసాహారాలు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. చేపల ధరతో పోలిస్తే మాంసం ధర నాలుగు రెట్టు అధికంగా వుండడంతో ఎక్కువ మంది చేపల కొనుగోలుకే మొగ్గు చూపారు. దీంతో పట్టణంలోని చేపల దుకాణాలు కిటకిటలాడాయి.
రాష్ట్రంలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలడంతో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. వైరస్ ప్రబలినచోట కోళ్ల చంపి, పూడ్చిపెడుతున్నారు. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా చికెన్ అమ్మకాలు అరకొరగానే సాగుతున్నాయి. దీంతో ఫారాల్లో బ్రాయిలర్ కోళ్లు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి కోళ్ల ఫారాల నిర్వాహకులకు భారంగా మారింది. అయిన కాడికి తెగనమ్ముకోవడానికి నిర్ణయించుకుని తక్కువ రేటుకు (ఫారం వద్ద లైవ్ కోడి కిలో రూ.50-60కి) అమ్మేస్తున్నారు. అయినా సరే కొనుగోలుదారులు కరవుయ్యారు. బర్డ్ ఫ్లూపై భయం వద్దని, చికెన్ తిన్నా ఏమీకాదని ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ అధికారులతోపాటు పౌల్ర్టీ కార్పొరేట్ కంపెనీలు చెబుతున్నప్పటికీ చికెన్ కొనుగోలుకు జనం ముందుకు రావడంలేదు. చోవడరం పట్టణంలో సుమారు 15 చికెన్ షాపులు వున్నాయి. ఆదివారంనాడు ఈ దుకాణాల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతుంటారు. బర్డ్ ఫ్లూ ప్రభావంతో గత వారం నుంచి చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. మటన్ కొనుగోలు చేద్దామంటే కిలో రూ.900 వుండడంతో చేపల దుకాణాల బాటపడుతున్నారు. ఫలితంగా చేపల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. చేపల రకం, సైజునుబట్టి కిలో రూ.130 నుంచి రూ.160 వరకు విక్రయించారు.
చికెన్ అమ్మకాలు బాగా పడిపోయాయి.
షేక్ షరీఫ్, చికెన్ వ్యాపారి, చోడవరం
ఎక్కడో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలితే.. ఇక్కడ చికెన్ కొనుగోలుకు జనం భయపడుతున్నారు. పది రోజుల నుంచి చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గతంలో సాధారణ రోజుల్లో వంద కిలోలు, ఆదివారం 200-250 కిలోల చికెన్ విక్రయించేవాడిని. ఇప్పుడు సాధారణ రోజుల్లో పది కిలోలు, ఆదివారం 25 కిలోలకు మించి అమ్మకాలు జనగడంలేదు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియడంలేదు. ప్రభుత్వం స్పందించి బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలి.