చికెన్ విక్రయాలు ఢమాల్
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:42 AM
బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరంలో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి.

మటన్‌కు పెరిగిన డిమాండ్
బర్డ్‌ఫ్లూ ప్రచారమే కారణం
విశాఖపట్నం/గోపాలపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరంలో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అదే సమయంలో మటన్‌కు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. నగరంలో ప్రతిఆదివారం రెండు లక్షల కిలోల చికెన్ విక్రయం జరిగేది. గతకొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి పెరిగింది. దీనివల్ల కోళ్లుకి వైరస్ సోకి మృత్యువాతపడుతున్నాయి. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కలిగిన కోడి మాంసాన్ని తింటే మనుషులకు కూడా వైరస్ సోకుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా చికెన్‌కు దూరంగా ఉండడమే మంచిదనే భావనతో ఉన్నారు.
నగరంలో ఆదివారం చికెన్ కొనుగోలుచేసేవారంతా ఆ దుకాణాలవైపు వెళ్లకపోవడంతో వెలవెలబోయాయి. అదే సమయంలో చికెన్ తినేవారంతా మటన్ కొనుగోలుకి ఆసక్తిచూపడంతో మటన్ దుకాణాలకు జనాలు పోటెత్తారు. సాధారణంగా ఆదివారం వచ్చే వారి కంటే అధికంగా కొనుగోలుదారులు వస్తుండడంతో మటన్ అయిపోతుందోనే ఆందోళన కొనుగోలుదారుల్లో ఏర్పడింది. దీంతో పోటీపడడంతో మటన్ దుకాణాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. గతంలో ఆదివారం వస్తే కొనుగోలుదారులతో రద్దీగా కనిపించే చికెన్‌దుకాణాల వద్ద కొనే వారే కనిపించకపోగా... ఆర్థికంగా కొంతస్థోమత కలిగినవారు, ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కలిగినవారు మాత్రమే కనిపించే మటన్ దుకానాల వద్ద గతంతో పోల్చితే మూడు, నాలుగురెట్లు రద్దీ కనిపించింది. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చికెన్‌వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.