దివ్యాంగ పింఛన్ల తనిఖీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:48 AM
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు అడ్డగోలుగా మంజూరైన దివ్యాంగ పింఛన్లపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

బోగస్‌లు, నకిలీల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు
సంక్రాంతి పండుగ తరువాత వైద్య బృందాలు పర్యటన
తొలి దశలో శాశ్వత వైకల్య పింఛన్లపై దృష్టి
తరువాత ఇతర కేటగిరీల్లో తనిఖీలు
ప్రభుత్వ నిర్ణయంతో బోగస్ లబ్ధిదారుల్లో గుబులు
చోడవరం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు అడ్డగోలుగా మంజూరైన దివ్యాంగ పింఛన్లపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్రాంతి పండుగ తరువాత గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత శాశ్వత వైకల్య పింఛన్లపై దృష్టి సారిస్తారు. అనంతరం ఇతర కేటగిరీల్లో కూడా తనిఖీలు నిర్వహించి అనర్హులను గుర్తించి రద్దు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బోగస్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దివ్యాంగ సర్టిఫికెట్లు పొంది ప్రతినెలా వేలాది రూపాయలు పింఛన్లుగా తీసుకుంటున్న నకిలీల భరతం పట్టాలని కూటమి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోగస్ దివ్యాంగుల ఏరివేతకు మండలాల వారీగా వైద్యులు, అఽధికారుల బృందం ఇంటింటా పరిశీలన చేయనున్నది. సంక్రాంతి పండుగ అనంతరం సర్వే ప్రారంభం అవుతుందని తెలిసింది. వైద్యులు, అధికారులతో కూడిన బృందాలు తమకు కేటాయించిన మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి దివ్యాంగ పింఛన్‌దారులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. తొలిదశలో మంచానికి పరిమితమై, శాశ్వత వైకల్యం వున్నట్టు జాబితాల్లో పేర్లు వున్న వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. తరువాత మిగిలిన కేటగిరీల దివ్యాంగులను తనిఖీ చేస్తారు. వైద్య నిపుణుల బృందం సమక్షంలో మరోసారి వైకల్యాన్ని నిర్ధారించే అవకాశం ఉందని చెబుతున్నారు. అనర్హులను ఏరివేసే సమయంలో అర్హులైన ఒక్క దివ్యాంగునికి కూడా అన్యాయం జరగకుండా చూసేలా అధికారులకు మార్గదర్శనం చేసినట్టు తెలిసింది. పింఛన్లు పొందుతున్న దివ్యాంగులను మరోసారి తనిఖీ చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం.. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ పొందుతున్న వారిలో గుబులు రేపుతున్నది.
దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ సొమ్మును గత ప్రభుత్వం పెంచడంతో ఎలాంటి వైకల్యం లేని వారు సైతం డాక్టర్లకు ముడుపులు ఇచ్చి, వైసీపీ నేతలతో సిఫారసు చేయించుకుని దివ్యాంగ సర్టిఫికెట్లు పొందారు. ఈ తరహా పింఛన్లు వైసీపీ ఐదేళ్లపాలనలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ఏ స్థాయిలో వుందంటే.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకుంటున్న వారిని చూసి.. ‘మీరు దివ్యాంగులా!’ అని పింఛన్ డబ్బులు పంపిణీ చేసే సచివాలయాల సిబ్బంది ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారు. కొందరు శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ దివ్యాంగుల సర్టిఫికెట్ తీసుకుని పింఛన్ పొందుతున్నారు. మరికొందరు గుండె ఆపరేషన్ జరగపోయినప్పటికీ, శస్త్రచికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్నట్టు సదరం సర్టిఫికెట్ సాధించి పింఛన్ పొందుతున్నారు. దివ్యాంగ పింఛన్ మంజూరుకు అవసరమైన సదరం సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు కొన్ని మండలాల్లో వైద్యులు, వైసీపీ నేతలు కసిపి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ వైసీపీ నేతల పాత్ర వుండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోగస్ పింఛన్‌దారుల గురించి జిల్లా, మండల కేంద్రాల్లో ప్రతి వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లపై దృష్టి సారించి వైద్య నిపుణులతో తనిఖీలు చేయాలని నిర్ణయించింది. దీంతో బోగస్ పింఛన్‌దారుల బండారం బయటపడుతుందని అసలైన దివ్యాంగులు అంటున్నారు.
అనర్హులను ఏరివేయాల్సిందే
శరగడం నాగభూషణం, అధ్యక్షుడు, దివ్యాంగుల సంక్షేమ సంఘం, చోడవరం
బోగస్ సదరం సర్టిఫికెట్లతో మంజూరైన దివ్యాంగ పింఛన్లను రద్దు చేయడానికి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. బోగస్ దివ్యాంగ పింఛనుదారుల వల్ల అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరుతున్నది. బోగస్ పింఛన్లను ఏరివేయాలని మేము చాలా కాలంగా కోరుతున్నాం. నకిలీల ఏరివేత సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.