Share News

ప్రాక్టికల్‌ పరీక్షలకు పైసా వసూల్‌!

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:03 AM

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేశాయి.

ప్రాక్టికల్‌ పరీక్షలకు పైసా వసూల్‌!

  • ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు...

  • ప్రైవేటు కళాశాలల నిర్వాకం

మద్దిలపాలెం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేశాయి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయిస్తామని విద్యార్థుల నుంచి డబ్బులు పిండుతున్నాయి. కొన్ని కళాశాలలు ల్యాబ్‌ ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేస్తుండగా, మరికొన్ని రూ.5 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

అక్రమాలు చోటుచేసుకోకూడదనే గతంలో ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌ పద్ధతిలో నిర్వహించేవారు. గత మూడేళ్లుగా ఈ విధానం రద్దు చేసి, విద్యార్థులు చదువుతున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంసెట్‌ ర్యాంకు కేటాయింపులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండడంతో విద్యార్థులకు ప్రతి మార్కు కీలకంగా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని కళాశాలల యాజమాన్యాలు ఫుల్‌ మార్కులు వేసేలా ఎగ్జామినర్లతో ముందస్తుగా మాట్లాడుకుంటున్నాయి. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేసి, వారికి చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

జిల్లాలో ఈనెల పదో తేదీ నుంచి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 146 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఎంపీసీ నుంచి 29,791, బైపీసీ నుంచి 4,888 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రభుత్వ కళాశాలలకు చెందిన 937 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షలకు జంబ్లింగ్‌ పద్ధతిలో ఎగ్జామినర్లను నియమిస్తారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బు వసూలుచేసినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలలు మినహా ప్రైవేటు కళాశాలల్లోని 33 వేల మందికి పైగా విద్యార్థుల నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.

అక్రమాలకు పాల్పడితే చర్యలు: ఆర్‌ఐఓ

పరీక్షల నేపథ్యంలో నగదు వసూళ్లపై ఆర్‌ఐవో మురళీధర్‌ను వివరణ కోరగా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆయా కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలకు నియమించిన సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Feb 08 , 2025 | 01:03 AM