వైసీపీ జిల్లా అధ్యక్షుని మార్పు?
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:22 AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ను నియమించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.
పరిశీలనలో తైనాల, వాసుపల్లి పేర్లు
రేపు నగరంలోని కార్పొరేటర్లు, నేతలతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త భేటీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ను నియమించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. మరో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు శనివారం నగరానికి వచ్చి నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా ప్రస్తుతం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కొనసాగుతున్నారు. అమర్‌నాథ్‌ను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ స్థానంలో మరొకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్ పేర్లను పరిశీలించినట్టు సమాచారం. మళ్ల విజయప్రసాద్ వ్యాపార నిమిత్తం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారని, అక్కడి నుంచి వచ్చి వెళుతున్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయనకు ఇవ్వడం సముచితం కాదని జిల్లాకు చెందిన నేతలు కొందరు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి చెప్పడంతో మిగిలిన ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. తైనాల గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ పరిశీలకుడిగా పనిచేశారు. వీరిద్దరిలో అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై క్యాడర్ నుంచి అభిప్రాయాలు సేకరించాల్సిందిగా ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబును అధిష్ఠానం ఆదేశించిందని, ఆయన వచ్చేనెల ఒకటిన (శనివారం) నగరానికి వస్తారని చెబుతున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇతర నేతలకు సమాచారం అందింది.