చకచకా జన్‌మన్ ఇళ్ల నిర్మాణాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:01 PM
మండలంలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తికాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.

పీవీటీజీలకు 1,650 పక్కా గృహాలు మంజూరు
ఉత్సాహంగా నిర్మిస్తున్న పీవీటీజీలు
ఇప్పటికే పూర్తయిన 50 ఇళ్లు
మరో 400 శ్లాబ్‌ల పూర్తి
మౌలిక సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు
ఐటీడీఏ పీవో ప్రత్యేక చొరవతో సాగుతున్న పనులు
(ఆంధ్రజ్యోతి/అరకులోయ)
మండలంలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తికాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణంపై ఐటీడీఏ పీవో ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
మండలంలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీలకు 1,650 పక్కా గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2023-24 చివరిలో వెయ్యి గృహాలు మంజూరు కాగా.. 2024-25లో 650 గృహాలు మంజూరయ్యాయి. గతానికి భిన్నంగా పీవీటీజీలు గృహ నిర్మాణాలకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు దగ్గరుండి నిర్మాణాలు చేసుకుంటున్నారు. జన్‌మన్ పథకంలో ఒక్కో ఇంటికి కేంద్రప్రభుత్వం రూ.2.39 లక్షలు మంజూరు చేసింది. వీటిలో రెండు లక్షలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. మిగిలిన రూ.39 వేలు ఉపాధి హామీ పథకం గృహ నిర్మాణ పనులు చేసేందుకు 90 పని దినాలకు రూ.39 వేలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులంతా పేదలుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పక్కాగృహాలు నిర్మించుకునే వీలుగా పనులు ప్రారంభానికి ముందే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.70 వేలు జమ చేస్తున్నది. దీంతో పీవీటీజీలు నిర్మాణ పనులను జాప్యం చేయకుండా వెంటనే ప్రారంభించారు. రూఫ్ లెవెల్ వరకు నిర్మాణ పనులు పూర్తయితే రూ.90 వేలు, శ్లాబ్‌వేసి, ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తే రూ.40 వేలు చెల్లిస్తారు. ఇప్పటికే 400 గృహాలకు శ్లాబ్‌లు వేసి, ఫినిషింగ్ పనులు చేస్తున్నారు. మరో 50 గృహాల నిర్మాణాలు పూర్తి చేసే దశలో ఉన్నాయి. రెండు దఫాలుగా మంజూరైన 1,650 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించారు. అన్ని ఇళ్ల నిర్మాణాల పనులు జోరుగా సాగుతున్నాయి. పీఎం జన్‌మన్ పథకంలో ఇళ్లు కేవలం గిరిజన తెగల్లో బాగా వెనుకబడిన పీవీటీజీలకు మాత్రమే మంజూరు చేశారు. మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ పరిధిలో పీవీటీజీలు అధికంగా ఉన్నారు. పెదగంగగుడి, పిరిబంద, సంఘంవలస, దాబుగుడ గ్రామాలలో పీవీటీజీలు ఇంటి నిర్మాణ పనుల్లో బిజిబిజిగా ఉన్నారు. జన్‌మన్ ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఐటీడీఏ పీవో అభిషేక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్లు, మురుగునీటి కాలువలు, పాఠశాల భవనం, అంగన్‌వాడీ భవనం, తాగునీటి పథకాలు, కమ్యూనిటీ భవనం నిర్మాణాలకు నిధులను మంజూరు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే పీవీటీజీలు అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయని పలువురు అంటున్నారు.