ఆగిన ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:32 AM
మండలంలో ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల శాఖ అధికారులు మూడు వారాల నుంచి నిలిపివేశారు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అడిగితే.. ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం పూర్తయినందున నిలిపివేసినట్టు సిబ్బంది చెబుతున్నారని రైతులు అంటున్నారు. దీంతో నూర్చిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు.

లక్ష్యం పూర్తయ్యిందంటున్న ఆర్‌ఎస్‌కేల సిబ్బంది
ధాన్యం అమ్మకాలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
బస్తాకు రూ.200 మేర తక్కువకు అమ్మకం
నాతవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల శాఖ అధికారులు మూడు వారాల నుంచి నిలిపివేశారు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అడిగితే.. ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం పూర్తయినందున నిలిపివేసినట్టు సిబ్బంది చెబుతున్నారని రైతులు అంటున్నారు. దీంతో నూర్చిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
నాతవరం మండలంలో తాండవ రిజర్వాయర్‌తోపాటు ఇతర వనరుల కింద సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో వరి కోతలు కోసిన రైతుల్లో పలువురు నూర్పులు పూర్తిచేసి ప్రభుత్వం ద్వారా ధాన్యం విక్రయించారు. అయితే రోడ్డుకు దూరంగా వున్న పొలాలు, బండి బాటలేని చోట్ల రైతులు వరి కుప్పలను నూర్చలేదు. వరి కోతల అనంతరం వేసిన మినుము, పెసర పంటలు పండడంతో ఇప్పుడిప్పుడే వరి కుప్పలను నూర్చుతున్నారు. ధాన్యం అమ్మడానికి రైతు సేవా కేంద్రాలకు వెళితే.. మండలంలో ధాన్యం కొనుగోళ్లు టార్గెట్ పూర్తయ్యిందని, అందువల్ల కొనుగోలు చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక దళారులు అడిన ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాను రూ.1,725కి కొనుగోలు చేస్తుంటే.. దళారులు రూ.1,500-1,600లకు మించి కొనుగోలు చేయడంలేదని చెబుతున్నారు. దీనివల్ల ఎకరాకు ఆరేడు వేల రూపాయల వరకు నష్టపోతున్నామని వాపోయారు. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు స్పందించి నాతవరం మండలంలో ధాన్యం కొనుగోళ్లను పునరుద్ధరించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జేసీ అనుమతించిన వెంటనే ధాన్యం కొనుగోళ్లు
జయంతి, పౌరసరఫరాల శాఖ డీఎం
నాతవరం మండలంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... ధాన్యం కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలని నాతవరం, నర్సీపట్నం, మాకవరపాలెం తదితర మండలాల రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల ఎండీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన వెంటనే ధాన్యం కొనుగోళ్లు పునఃప్రారంభిస్తామని ఆమె చెప్పారు.
గొలుగొండ మండలంలో..
గొలుగొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం అమ్మపేట, పాతల్లంపేట, ఏటిగైరంపేట, పాకలపాడు, రావణాపల్లి, కొత్తమల్లంపేట, జోగంపేట, గొలుగొండ చీడిగుమ్మల, గుండుపాల గ్రామాల్లో వరికుప్పలు నూర్పులు జరుగుతున్నాయి. మండలంలో చీడిగుమ్మల, చోద్యం, గొలుగొండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 595 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు విధించిన లక్ష్యం పూర్తి కావడంతో కొనుగోళ్లు నిలిపివేసినట్టు రైతు సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించగా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే.. ధాన్యం కొనుగోళ్లు చేపట్టడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు.
పాయకరావుపేటలో..
పాయకరావుపేట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొన్ని గ్రామాల్లో రైతులు వరి కుప్పలు ఇంకా నూర్చకపోవడంతో ధాన్యం కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు మండల వ్యవసాయాధికారి ఆదినారాయణ తెలిపారు. ఖరీఫ్‌లో వరి సాగు చేసిన భూముల్లో రైతులు వరి కోతల అనంతరం అపరాల పంటలు వేశారని, దీనివల్ల వరి కుప్పలను అప్పట్లో నూర్చలేదని చెప్పారు. ప్రస్తుతం అపరాల పంటల కోతలు జరుగుతున్నాయని, ఇవి పూర్తయిన తరువాత వరి కుప్పలు నూరుస్తారని అన్నారు. ధాన్యం విక్రయానికి రైతులు ముందుకు వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
ఎస్.రాయవరం మండలంలో..
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 25 (ఆంరఽధజ్యోతి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లను తాత్కాలికంగా ఆపేశామని మండల వ్యవసాయాధికారి సౌజన్య తెలిపారు. మండలంలో 800 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది లక్ష్యం కాగా, గత వారం వరకు 664 టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్పారు. పొలాల్లో అపరాల పంటలు వుండడంతో కొంతమంది రైతులు వరి నూర్పులను వాయిదా వేసుకున్నారని తెలిపారు. అయినప్పటికీ రైతుల నుంచి మరో 400 టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం వుందన్నారు.