విమ్స్‌లో సీబీఆర్‌ఎన్ మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:30 AM
ప్రమాద, విపత్తులతో పాటు వైరస్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని పది రాష్ట్రాలకు అత్యాధునిక వసతులు, నిపుణులతో కూడిన సెకండరీ లెవెల్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్) మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్లను మంజూరుచేసింది.

సుమారు రూ.15 కోట్లతో ఏర్పాటు
స్థలం కేటాయింపు...త్వరలో పనులు ప్రారంభం
ప్రమాద, విపత్తు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రమాద, విపత్తులతో పాటు వైరస్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని పది రాష్ట్రాలకు అత్యాధునిక వసతులు, నిపుణులతో కూడిన సెకండరీ లెవెల్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్) మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్లను మంజూరుచేసింది. ఆ పదింటిలో మన రాష్ట్రం కూడా ఉంది. ఆ సెంటర్‌ను విమ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.
కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లతో సీబీఆర్‌ఎన్ మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయబోతోంది. ఈ కేంద్రంలో పనిచేసేందుకు అవసరమైన నిపుణులను, సాంకేతిక సిబ్బందిని కేంద్ర ప్రభుత్వమే పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది సిబ్బందిని నియమించుకోవాలని. వారికి కేంద్రం నుంచి వచ్చిన నిపుణులు మెరుగైన వైద్య సేవలను అందించే విధానాలపై శిక్షణ అందిస్తారు. జీత,భత్యాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లించనున్నాయి. మూడేళ్లపాటు నిర్వహణకు అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుంది. అనంతరం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ సెంటర్ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుంది.
అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు
ఫార్మా, ఇతర పరిశ్రమల్లో ప్రమాదాల్లో జరిగితే ప్రస్తుతం క్షతగాత్రులను కేజీహెచ్‌కు పంపుతున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే, అత్యాధునిక పరికరాలు, నిపుణులు లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందిగా మారుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ సీబీఆర్‌ఎన్ మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ పేలుడు, కొవిడ్ తరహా వైరస్ బాధితులకు బయోలాజికల్ విభాగానికి చెందిన నిపుణులు, పరిశ్రమల్లో రేడియేషన్‌కు సంబంధించిన పదార్థాల పేలుడు జరిగినప్పుడు రేడియోలాజికల్ విభాగ సిబ్బంది సేవలు అందించనున్నారు. పరిశ్రమలు, నేవీ, ఆర్మీ వద్ద న్యూక్లియర్ పదార్థాలు ఉంటాయి. పొరపాటున పేలుడు జరిగినా, లీక్ అయినా బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు అనుగుణంగా ప్రత్యేకంగా న్యూక్లియర్ బ్లాక్‌ను ఏర్పాటుచేస్తారని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించామని, కొద్దిరోజుల్లో నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్య సేవలను అందించవచ్చునన్నారు.