Share News

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సందడి

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:21 PM

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, నాలుగు హైస్కూలు ప్లస్‌లలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సందడి
నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, సబ్బవరంలో అనిత, మిగతా చోట్ల ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ప్రారంభించిన వైనం

జిల్లాలో తొలి రోజు 4,700 మంది విద్యార్థులు హాజరు

అనకాపల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, నాలుగు హైస్కూలు ప్లస్‌లలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఆరు వేల మందికిపైగా విద్యార్థులు ఉండగా, 4,700 మంది తొలి రోజు భోజనం చేశారు. నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేశ్‌ల సమక్షంలో ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో భోజన పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డ్రాపౌట్స్‌ తగ్గడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం కోసం పడే ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. మాడుగుల జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, చోడవరం జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌. రాజు పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనకాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:21 PM