వరహా నదికి తూట్లు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:11 AM
మండలంలో వరహా నదిలో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక అవసరాలకు అనుమతి పేరుతో దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలకు సమీపంలో కూడా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ముప్పు కలుగుతుంది. నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో గోతులు ఏర్పడి, ప్రమాదకరంగా మారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పందూరుసహా పలు గ్రామాల వద్ద ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
ఐదు అడుగుల లోతున కందకాలు
తాగునీటి పథకాలకు ముప్పు
సొంత అవసరాల మాటున ఇసుక వ్యాపారం చేస్తున్న నేతలు
పట్టించుకోని అధికారులు
కోటవురట్ల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలో వరహా నదిలో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక అవసరాలకు అనుమతి పేరుతో దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలకు సమీపంలో కూడా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ముప్పు కలుగుతుంది. నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో గోతులు ఏర్పడి, ప్రమాదకరంగా మారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో ఎక్కడా ఇసుక రీచ్‌లు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వారు అధికారుల నుంచి అనుమతి తీసుకుని సమీపంలోని నదులు, గెడ్డల్లో ఇసుక తవ్వుకుని తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కోటవురట్ల మండలంలో పందూరు వద్ద మాత్రమే వరహా నదిలో ఇసుక తవ్వకాలకు మండలం అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఇసుక అవసరమైన వారు సమీపంలోని గ్రామ సచివాలయంలో ఇంటి ప్లాన్‌తోపాటు దరఖాస్తు అందజేసి అనుమతి పొందాలి. సిబ్బంది అందజేసే స్పిప్పుతో 24 గంటల్లోగా నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుకను తవ్వి ఎడ్ల బండి లేదా ట్రాక్టర్ ద్వారా మాత్రమే తీసుకెళ్లాలి. కానీ మండలంలో పలుచోట్ల వరహా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పైగా ఐదు అడుగులకన్నా ఎక్కువ లోతుగా ఇసుక తోడుతున్నారు. నిబంధనల ప్రకారం వంతెనలు, చెక్ డ్యామ్‌లు, రక్షిత తాగునీటి పథకాలు, ఇతర కట్టడాలకు 500 మీటర్ల లోపు ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ వంతెనలు, రక్షిత మంచినీటి పథకాలకు అతి సమీపంలో కూడా ఇసుక తవ్వుతున్నారు. రామచంద్రపురం పంచాయతీ గూడుపులోవ సమీపంలో వరహా నదిలో భారీ రక్షిత మంచినీటి పథకం వుంది. ఇక్కడి నుంచి కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో 36 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీనికి సమీపంలో ఎక్కువ లోతున ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి, వేసవితో తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుంది. వాస్తవంగా సొంత అవసరాలకు మాత్రమే నదిలో నుంచి ఇసుక తీసుకెళ్లాల్సి వుండగా, ఇక్కడ రాజకీయ నాయకులు ముఠాగా ఏర్పడి, దర్జాగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు.