పేదల లేఅవుట్లకు తూట్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:49 AM
మండలంలోని పలు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో గ్రావెల్ తవ్వకాలు ఆగడంలేదు. లే-అవుట్ల అభివృద్ధికి, ఇళ్ల పునాదులు నింపేందుకు సమీపంలో ఉన్న వ్యర్థ పదార్థాలను వినియోగించుకోవడానికి అనుమతించాలంటూ ఉన్నతాధికారులకు స్థానిక తహసీల్దారు ఇచ్చిన లేఖను అడ్డం పెట్టుకుని ఖాళీ స్థలాల్లో, ఇళ్లకు ఆనుకుని గ్రావెల్ తవ్వుకుపోతున్నారు.

ఇళ్ల స్థలాలను ఆనుకొని ఇష్టారాజ్యంగా గ్రావెల్, మట్టి తవ్వకాలు
పునాదులు సైతం ధ్వంసం
పట్టించుకోని వీఎంఆర్‌డీఏ అధికారులు
సబ్బవరం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో గ్రావెల్ తవ్వకాలు ఆగడంలేదు. లే-అవుట్ల అభివృద్ధికి, ఇళ్ల పునాదులు నింపేందుకు సమీపంలో ఉన్న వ్యర్థ పదార్థాలను వినియోగించుకోవడానికి అనుమతించాలంటూ ఉన్నతాధికారులకు స్థానిక తహసీల్దారు ఇచ్చిన లేఖను అడ్డం పెట్టుకుని ఖాళీ స్థలాల్లో, ఇళ్లకు ఆనుకుని గ్రావెల్ తవ్వుకుపోతున్నారు.
మండలంలోని పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం, గొల్లలపాలెం, అసకపల్లి, అజనగిరి, నంగినారపాడు, గాలిభీమవరం గ్రామాల్లో గత ప్రభుత్వం హయాంలో రైతుల నుంచి భూములను సమీకరించి, పేదలకు ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్లు వేశారు. ఈ స్థలాలతోపాటు రైతులకు పరిహారంగా ఇచ్చిన స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన గ్రావెల్ తవ్వుకునేందుకు నాడు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. కానీ నాడు వైసీపీ నాయకుల అండదండలతో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన లే-అవుట్లకు అనుకొని ఉన్న కొండవాలు ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వి, తరలించుకుపోయారు. పైగా ఆయా వాహనాలపై ‘వీఎంఆర్‌డీఏ’ స్టిక్కర్లు అతికించి, దర్జాగా గ్రావెల్, మట్టి తవ్వుకున్నారు. కొంతకాలం తరువాత పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ తవ్వుకోవడం మొదలు పెట్టారు. అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
కూటమి హయాంలోనూ ఆగని గ్రావెల్ తవ్వకాలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి ఇటీవల వరకు ఇళ్ల స్థలాల లేఅవుట్లలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొంతమేర ఆగాయి. దీంతో లే-అవుట్లు, భూములు ఇచ్చిన రైతుల పరిహారం ప్లాట్లలో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. ఈ విషయం తహసీల్దార్ బి.చిన్నికృష్ణ దృష్టికి రావడంతో లే-అవుట్లు, రైతుల రిటర్న్ ప్లాట్ల అభివృద్ధికి సమీపంలో ఉన్న వ్యర్థాలను వినియోగించుకోవడానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్, వీఎంఆర్‌డీఏ ఈఈ, ఆర్‌డీఓ, మైనింగ్ ఏడీ, స్థానిక పోలీసులకు గత నెల 27న లేఖలు రాశారు. ఆయా అధికారుల నుంచి ఇంకా అనుమతి రాలేదు. కానీ తహసీల్దారు పంపిన లేఖ జెరాక్స్ కాపీని పట్టుకొని, లేఅవుట్ల వద్ద గ్రావెల్ తవ్వేస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల పునాదులను ఆనుకుని గ్రావెల్ తవ్వడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. నంగినారపాడు, గంగవరం లే-అవుట్లలో సుమారు 1,000 ప్లాట్లు కనిపించకుండా (గ్రావెల్ తవ్వకాలతో) పోయినట్టు వీఎంఆర్‌డీఏ హౌసింగ్ అధికారులు గుర్తించారు. పైడివాడఅగ్రహారంలో కూడా సుమారు 200 ప్లాట్లు కనిపించడంలేదు. కాగా ఇళ్ల స్థలాల లేఅవుట్లకు ఆనుకుని అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై తహసీల్దార్ బి.చిన్నికృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, గ్రావెల్ లేదా మట్టి తవ్వుకునేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి, లేఅవుట్ అవసరాలకు వారే దగ్గరుడి గ్రావెల్ తవ్వేంచేలా చర్యలు తీసుకుంటానన్నారు.