బోసిపోయిన నగరం
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:26 AM
నగరం ఇంకా బోసిపోతూనే ఉంది. సంక్రాంతి ముఖ్యమైన పండుగ కావడంతో అత్యధికులు కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లిపోయారు.

సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లినవారు ఇంకా తిరిగిరాకపోవడంతో నిర్మానుష్యంగా రహదారులు
ఈసారి కనుమనాడు భారీగా మాంసం అమ్మకాలు
50 టన్నుల మటన్, రెండు లక్షల కోళ్లు...
మద్యం అమ్మకాలు రూ.20 కోట్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరం ఇంకా బోసిపోతూనే ఉంది. సంక్రాంతి ముఖ్యమైన పండుగ కావడంతో అత్యధికులు కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే విశాఖపట్నంలో రహదారులన్నీ బుధవారం బోసిపోయి కనిపించాయి. కనుమ పండుగ జరుపుకుని సమీప ప్రాంతాల్లో ఉన్నవారు రాత్రి నగరానికి చేరుకున్నారు. ఇంకా అత్యధికులు గ్రామాల్లోనే ఉన్నారు. వారంతా గురువారం బయలుదేరి వచ్చే అవకాశం ఉంది.
ఈసారి సంక్రాంతి పండుగ మాంసం విక్రేతలకు కలిసి వచ్చింది. వ్యాపారం భారీగా జరిగింది. నగర వాసులు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే మటన్, చికెన్ దుకాణాల ముందు క్యూ కట్టారు.
నగరంలో సాధారణంగా ఆదివారాల్లో మూడువేల మేకలు/గొర్రెలు కబేళాలో కోస్తారు. ఒక్కో మేక/గొర్రె నుంచి సగటున పది కిలోల మాంసం లభిస్తుంది. అంటే ప్రతి ఆదివారం 30 టన్నుల మాంసం విక్రయిస్తారు. ఈసారి కనుమ రోజున (బుధవారం) ఆదివారం కంటే రెట్టింపు విక్రయాలు చేశామని, వ్యాపారం బాగా జరిగిందని మటన్ దుకాణాల నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేశారు. బుధవారం సుమారు 50 నుంచి 60 టన్నుల మాంసం విక్రయమైంది. ఇంతకు ముందు కిలో మాంసం రూ.900-940 ఉండేది. బుధవారం వేయి రూపాయలు చేసేశారు. దాంతో రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే ఆదివారం నగరంలో దాదాపు ఐదు లక్షల కోళ్లను విక్రయిస్తుంటారు. కానీ బుధవారం చికెన్‌కు పెద్దగా డిమాండ్ కనిపించలేదు. దాంతో రెండు లక్షల కోళ్లు మాత్రమే విక్రయించగలిగామని వ్యాపారులు తెలిపారు. కిలో సగటును రూ.250 చొప్పున అమ్మామని, పెద్దగా లాభం లేదని పేర్కొన్నారు.
కనిపించని మందుబాబులు సందడి
సంక్రాంతి పండుగకు నగరంలో మందుబాబుల సందడి పెద్దగా కనిపించలేదు. అత్యధికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో నగరంలో మద్యం దుకాణాలకు గిరాకీ పడిపోయింది. ఆదివారాల్లో ఉండే బేరం కూడా లేకుండా పోయిందని పలువురు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు కలిపి రూ.20 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగి ఉంటాయని ఓ అధికారి తెలిపారు.