అభివృద్ధికి నోచుకోని బొజ్జన్నకొండ
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:58 AM
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండ అభివృద్ధి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం బొజ్జన్న కొండను పర్యాటక, ఆధ్మాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో నాటి వైసీపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కోటి రూపాయాల పైచిలుకు వెచ్చించి నిర్మించిన ఎమినిటీ సెంటర్ భవనాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాకుండా నిరుపయోగంగా వుంచేశారు.

మూడేళ్ల క్రితం రూ.7.5 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
పర్యాటకంగా, అధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాటి వైసీపీ పాలకులు
ఎమినిటీ సెంటర్ భవనం మాత్రమే నిర్మాణం
ఇంతవరకు పర్యాటకులకు అందుబాటులోని రాని దుస్థితి
బొజ్జన్నకొండను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం
కొత్తగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా వుంది ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండ అభివృద్ధి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం బొజ్జన్న కొండను పర్యాటక, ఆధ్మాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో నాటి వైసీపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కోటి రూపాయాల పైచిలుకు వెచ్చించి నిర్మించిన ఎమినిటీ సెంటర్ భవనాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాకుండా నిరుపయోగంగా వుంచేశారు.
అన్ని రంగాల మాదిరిగానే పర్యాటక రంగాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జిల్లాలో అనే ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు వున్నప్పటికీ పట్టించుకోలేదు. అప్పటికే ఉన్న పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, నిర్వహణ లోపించడంతో అధ్వానంగా తయారయ్యాయి. మరోవైపు అనకాపల్లి సమీపంలో వున్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండను పర్యాటకంగా, అధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించగా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
బొజ్జన్న కొండ కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలో వుంది. నిత్యం ఎంతో పర్యాటకులు సందర్శిస్తుంటారు. కొండపైన, గుహ లోపల శిల్ప సంపద, బుద్ధుని విగ్రహాలు, ధాన్య మందిరాలు, బౌద్ధ భిక్షువులు ఆవాసం వుండడానికి పెద్ద పరిమాణంలోగల ఇటుకలతో నిర్మించిన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున మేళా నిర్వహిస్తుంటారు. దేశ విదేశాల నుంచి బౌద్ధబిక్షువులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. దీంతో బొజ్జన్న కొండను పర్యాటకంగా, అధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం భావించింది. 2022లో రూ.7 కోట్లు మంజూరు చేసింది. ధ్యాన మందిరం, ఎమినిటీ సెంటర్, లేజర్ షో, సౌండ్ అండ్ లైటింగ్ షో, పార్కు, రహదారులు, లైట్లు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ పనులు చేసే బాధ్యతను నాడు రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వానికి అప్పగించింది. రూ.1 కోటి 27 లక్షల వ్యయంతో ఎమినిటీ సెంటర్ భవనాన్ని నిర్మించారు. పర్యాకులకు గైడ్ చేసేందుకు లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు పనులు చేయలేదు. లేజర్ షో పనులు సైతం చేపట్టలేదు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిఇన సోలార్ లైట్లకు రక్షణ లేకపోవడంతో దొంగలపాలవుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారి నుంచి బొజ్జన్న కొండకు రోడ్డు అభివృద్ధి, ఆర్చి నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.90 లక్షలు మంజూరు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా సిమెంట్ రోడ్డు వేసి, ముఖ ద్వారాన్ని నిర్మించారు.
డీపీఆర్ తయారీకి ప్రభుత్వం ఆదేశాలు
ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడడంతో బొజ్జన్నకొండను పర్యాటకంగా అభివృద్ధి చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. బొజ్జన్నకొండ అభివృద్ధికి కొత్తగా డీపీఆర్‌ను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా పర్యాటక అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు.