బర్డ్ ఫ్లూ టెన్షన్
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:29 AM
రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఫ్లూ బారినపడి అనేకచోట్ల పెద్దఎత్తున కోళ్లు మృతిచెందుతున్నాయి.
చికెన్, గుడ్లు వినియోగంపై అనుమానాలు
ఆందోళన అవసరం లేదంటున్న వైద్యులు
బాగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలని సూచన
ఆమ్లెట్లు, సగం ఉడికిన గుడ్లు, గ్రిల్డ్ చికెన్, ఉడికీ, ఉడకని చికెన్‌కు దూరంగా ఉంటే మంచిది
బర్డ్ నుంచి మనిషికి ఫ్లూ సోకే అవకాశం చాలా తక్కువ
అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. ఫ్లూ బారినపడి అనేకచోట్ల పెద్దఎత్తున కోళ్లు మృతిచెందుతున్నాయి. ఇటువంటి తరుణంలో కోడిమాంసం, గుడ్లు తినొచ్చా?, తినకూడదా?...అనే అనుమానాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులతో మాట్లాడి అందిస్తున్న ప్రత్యేక కథనం....
బర్డ్ ఫ్లూ అనేది కోళ్లకు, వాటి ద్వారా మనుషులకు వస్తుంది. దీన్ని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని పేర్కొంటారు. దీనిని తొలిసారి 2006లో భారత్‌లో గుర్తించారు. అప్పటి నుంచి అడపాదడపా ఏదో ఒక రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిచెందిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. అయితే, బర్డ్ ఫ్లూ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. బర్డ్ ఫ్లూ వెలుగుచూసిన ప్రాంతం నుంచి పది కిలోమీటర్లు మేర మాత్రమే వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేగాకుండా బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో గల ఫారాల్లోని కోళ్లను పూర్తిగా పాతిపెట్టారు. అందువల్ల ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. అయితే కోడి మాంసం, గుడ్లు తినొచ్చా?...అంటూ పలువురు తెలిసిన వైద్యులను అడుగుతున్నారు. కోడి మాంసాన్ని అధిక డిగ్రీల్లో (160కుపైగా) ఉడికించి తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు కూడా బాగా ఉడకబెట్టి తినడం మంచిది. కొద్దిరోజులపాటు ఆమ్లెట్స్, సగం ఉడికిన గుడ్లు తినకుండా ఉండడం మంచిదంటున్నారు. అలాగే, గ్రిల్డ్ చికెన్, ఉడికీ, ఉడకని చికెన్‌కు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ నమోదైన ప్రాంతానికి విశాఖ దూరంగా ఉండడం వల్ల ప్రస్తుతం ఇబ్బందేమీ ఉండదని, కానీ తగిన జాగ్రత్తలను పాటించాలని పేర్కొంటున్నారు.
ఇలా వ్యాప్తి..
సాధారణంగా కోళ్ల నుంచి మనుషులకు ఈ వ్యాధి అంత వేగంగా రాదు. ఆయా కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కోడి మలం, మూత్రం అంటిన వారికి ఈ వైరస్ సోకుతుందని, అది అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగు తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కోళ్ల నుంచి మనుషులకు సోకితే మాత్రం స్వైన్ ఫ్లూకు ఇచ్చే మందులు అందించి కోలుకునేలా చేస్తారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ముప్పు కొంచెం అధికంగా ఉంటుందని, కాబట్టి అటువంటి వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రజలకు ఇబ్బంది లేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు.