ఇసుక తవ్వకాలకు వేలంపాటలు!
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:43 AM
మండలంలోని వరహా నదిలో ఇసుక తవ్వకాలకు గొట్టివాడ, పందూరు గ్రామాల్లో వేలం పాటలు నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కొంతమంది యువకులు బృందంగా ఏర్పడి ‘మా నది.. మా ఇసుక’ అంటూ ఈ ప్రక్రియ నిర్వహించారు.

గొట్టివాడలో రూ.19 లక్షలు, పందూరులో రూ.22.5 లక్షలు
రాజకీయాలకు అతీతంగా వేలం పాటలు నిర్వహించిన యువకులు
మాకవరపాలెం మండలం నారాయణరాజుపేటకు చెందిన ఓ వ్యక్తికి తవ్వకాలు, విక్రయం బాధ్యత
ఒక్కో ఇసుక ట్రాక్టర్ నుంచి రూ.1,000 చొప్పున వసూలు
కోటవురట్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వరహా నదిలో ఇసుక తవ్వకాలకు గొట్టివాడ, పందూరు గ్రామాల్లో వేలం పాటలు నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కొంతమంది యువకులు బృందంగా ఏర్పడి ‘మా నది.. మా ఇసుక’ అంటూ ఈ ప్రక్రియ నిర్వహించారు. గొట్టివాడలో రూ.19 లక్షలు, పందూరులో రూ.22..5 లక్షలకు వేలం పాటలు ఖరారయ్యాయి. ఈ గ్రామాల పరిధిలోని వరహా నదిలో ఇసుక తవ్వకాలు, విక్రయం హక్కులను మాకవరపాలెం మండలం నారాయణరాజుపేటకు చెందిన ఓ వ్యక్తికి అప్పగించారు.
ఇళ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివాడ గ్రామాల వద్ద వరహా నదిలో ఉచితంగా ఇసుక తవ్వుకుని తీసుకెళ్లడానికి మండల అధికారులు అనుమతులు మంజూరు చేశారు. అయితే తమ గ్రామాల వద్ద వేరేవాళ్లు ఇసుక తవ్వుకుపోవడం ఏమిటంటూ గ్రామ దేవతల ఉత్సవాల ఖర్చుల పేరుతో గత ఏడాది స్థానిక నాయకులు వేలం పాటలు నిర్వహించారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అనధికారికంగా వసూలు చేశారు. అప్పట్లో నిర్వహించిన వేలం పాటల గడువు ఇటీవల ముగియడంతో మరోసారి వేలం పాటలు నిర్వహించారు. గొట్టివాడలో ఐదుగురు వ్యక్తులు కలిసి సుమారు నెల రోజుల క్రితం రూ.19 లక్షలకు వేలం పాట నిర్వహించారు. వరహా నదిలో ఇందేశమ్మవాక ప్రాంతంలో ఇసుక తవ్వకాల కోసం మూడు రోజుల క్రితం పందూరులో 20 మంది యువకులు కలిసి రాజకీయాలకు అతీతంగా రూ.22..5 లక్షలకు ఇసుక వేలంపాట నిర్వహించారు. అనంతరం మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట గ్రామానికి చెందిన ఒక వ్యాపారికి ఇసుక తవ్వకం, అమ్మకాల బాధ్యతలు అప్పగించారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.1,000 చొప్పున వసూలు చేయాలని తీర్మానించారు. అయితే ఇటీవల గొట్టివాడ వద్ద వరహా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ తిరుమలబాబు అక్కడకు వెళ్లి, ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వరహా నదిలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్దిరోజులపాటు తవ్వకాలు ఆగిపోయాయి. అయితే రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.