హరిపురంలో భూ దందా
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:04 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినప్పటికీ జిల్లాలో ప్రభుత్వ భూములతోపాటు జిరాయితీ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే వున్నాయి. కూటమి పార్టీలకు చెందిన కొంతమంది స్థానిక నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూదందాలకు తెగబడుతున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకులు ఒక్కటై, ఎన్‌ఆర్‌ఐకి చెందిన భూమిని చేజిక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎన్‌ఆర్‌ఐ.. స్థానికంగా వున్న తన బంధువు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇది సివిల్ మేటర్.. కోర్టును ఆశ్రయించండి’ అని పోలీసులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వివరాల్లోకి వెళితే...

ఎన్‌ఆర్‌ఐకి చెందిన స్థలంపై ఎలమంచిలి వైసీపీ నేత కన్ను
రాంబిల్లి మండల టీడీపీ నాయకుడి సహకారం
రద్దయిన జీపీఏని అడ్డంపెట్టుకుని రిజిస్ర్టేషన్‌కు యత్నాలు
తన బంధువు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్‌ఆర్‌ఐ
అనంతరం టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నాయకుడు
తాజాగా మొత్తం భూమి ఆక్రమణకు యత్నం
ఎన్‌ఆర్‌ఐ బంధువు మరోసారి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
కోర్టు ద్వారా న్యాయం పొందాలని పోలీసులు సలహా
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినప్పటికీ జిల్లాలో ప్రభుత్వ భూములతోపాటు జిరాయితీ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే వున్నాయి. కూటమి పార్టీలకు చెందిన కొంతమంది స్థానిక నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూదందాలకు తెగబడుతున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకులు ఒక్కటై, ఎన్‌ఆర్‌ఐకి చెందిన భూమిని చేజిక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎన్‌ఆర్‌ఐ.. స్థానికంగా వున్న తన బంధువు ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇది సివిల్ మేటర్.. కోర్టును ఆశ్రయించండి’ అని పోలీసులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వివరాల్లోకి వెళితే...
రాంబిల్లి మండలం హరిపురం గ్రామం సర్వే నంబరు 102లో విశాఖపట్నంలోని రామ్‌నగర్‌కు చెందిన ఒక ప్రవాస భారతీయుడికి (ఎన్‌ఆర్‌ఐ) ఎకరా మూడు సెంట్ల భూమి వుంది. ఇతని తాతముత్తాతలు రాంబిల్లి మండలానికి చెందిన వారు కావడంతో హరిపురంలో భూమిని గతంలో కొనుగోలు చేశారు. కొంతకాలం తరువాత ఇందులో 40 సెంట్లను విక్రయించారు. మిగిలిన 63 సెంట్ల స్థలం ఎన్‌ఆర్‌ఐ పేరునే ఉంది. కాగా 27 సెంట్ల స్థలాన్ని 2021లో జూలైలో పంచదార్ల గజ్జాలు అనే వ్యక్తికి ఎన్‌ఆర్‌ఐ జీపీఏ ఇచ్చారు. 2024లో జీపీఏను రద్దు చేసుకుంటూ ఎన్‌ఆర్‌ఐ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 63 సెంట్ల స్థలం ఎన్‌ఆర్‌ఐ పేరునే వుంది.
ఎన్‌ఆర్‌ఐ స్థలంపై వైసీపీ నేత కన్ను
హరిపురంలో ప్రధాన రహదారికి సమీపంలో సెంటు స్థలం రూ.10 లక్షలకు పైగా ధర పలుకుతున్నది. ఎన్‌ఆర్‌ఐకి చెందిన స్థలంపై వైసీపీకి చెందిన ఎలమంచిలి మునిసిపాలిటీలో ఒక మహిళా ప్రజాప్రతినిధి కుమారుడి కన్నుపడింది. హరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడితో చేతులు కలిపాడు. ఎన్‌ఆర్‌ఐ గతంలో జీపీఏ ఇచ్చిన (తరువాత రద్దు చేసుకున్నారు) గజ్జాలు అనే వ్యక్తితో కుమ్మక్కై 63 సెంట్ల స్థలంలో 27 సెంట్ల స్థలాన్ని ఎలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైసీపీ నేత తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా మొత్తం స్థలం చుట్టూ సిమెంట్ స్తంభాలు వేయించారు. ఇందుకు స్థానిక టీడీపీ నేత సహకరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ఆర్‌ఐ గత ఏడాది జూలై 28న తన బంధువు (నవీన్) ద్వారా రాంబిల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సదరు వైసీపీ నాయకుడు పార్టీ ఫిరాయించి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మొత్తం 63 సెంట్ల స్థలాన్ని పావులు కదుపుతున్నారు. ఎన్‌ఆర్‌ఐకి చెందిన స్థలాన్ని ట్రాక్టర్‌తో దున్నించారు. చుట్టూ స్తంభాలు వేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ఆర్‌ఐ బంధువు నవీన్ శనివారం తహసీల్దారు కార్యాలయంలో, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అప్పట్లో వైసీపీలో వున్న నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరడం, ఇతనికి స్థానిక టీడీపీ నాయకుడు అండగా వుండడంతో భూ ఆక్రమణపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని తెలిసింది. అంతేకాక కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని ఎన్‌ఆర్‌ఐ బంధువు వాపోయారు.