జోరుగా బెట్టింగ్
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:45 AM
నగరంలో ప్రతి వీధిలోనూ బెట్టింగ్ ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లే కాకుండా వివిధ దేశాల్లో జరిగే లీగ్ మ్యాచ్‌లపైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి.

తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో నిర్వహణ
ఇటీవల ఒక ముఠాపై సీపీకి ఫిర్యాదు
పెదవాల్తేరులో రవికుమార్ అనే బుకీని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్
వదిలేయాలంటూ నేతల ఫోన్లు
ముఠాలోని మిగిలిన వారిని అరెస్టు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లు?
పోలీసులు ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ప్రతి వీధిలోనూ బెట్టింగ్ ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లే కాకుండా వివిధ దేశాల్లో జరిగే లీగ్ మ్యాచ్‌లపైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. గతంలో మాదిరిగా హోటళ్లు, అద్దెకు తీసుకున్న ఫ్లాట్ల నుంచి కాకుండా బుకీలు తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. చాపకింద నీరులా సాగిపోతున్న బెట్టింగ్ ముఠాల వ్యవహారాలు ఇటీవల ఒక ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేయడంతో బట్టబయలయ్యాయి. అయితే నిందితులను అరెస్టు చేయకుండా నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు కొందరు నేరుగా పోలీసులపై ఒత్తిడి చేసున్నట్టు చెబుతున్నారు.
నగరంలో ఇసుకతోట, పీతలవానిపాలెం, శివాజీపాలేనికి చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి భారీస్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చికి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన సీపీ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదులో బుకీలుగా పేర్కొన్న వ్యక్తుల సెల్‌ఫోన్ కాల్‌డేటా, టవర్ లొకేషన్‌తోపాటు వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈనెల ఆరో తేదీన బిగ్‌బాస్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్‌లపై పెదవాల్తేరులోని ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్న లగుడు రవికుమార్ మొబైల్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. అతడి ఇంటిపై దాడి చేశారు. ఎస్‌యూడీఏ మొబైల్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా రవికుమార్ పట్టుబడ్డాడు. 92 బ్యాంకు ఖాతాలకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా వందకుపైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. రవికుమార్‌ను విచారించడంతో పాటు అతని వద్ద లభించిన ఇతర ఆధారాల ద్వారా కాకినాడకు చెందిన కార్తీక్, జిలానీ, శివాజీపాలేనికి చెందిన బొబ్బిలి రవికుమార్, ఇసుకతోటకు చెందిన పల్లా త్రినాథ్ ప్రమేయం కూడా బెట్టింగ్‌లో పాలుపంచుకుంటున్నట్టు గుర్తించారు. రవికుమార్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియగానే నగరానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి నేరుగా టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారితో మాట్లాడి అతడిని వదిలేయాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సీపీ నుంచే నేరుగా తమకు ఆదేశాలు రావడంతో తాము ఏమీ చేయలేమని సదరు ప్రజా ప్రతినిధికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సున్నితంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తర్వాత మరొక ప్రజా ప్రతినిధి పీఏ ద్వారా ఒత్తిడి చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదుచేయడంతోపాటు రవికుమార్‌ను అరెస్టు చేసినట్టు రికార్డుల్లో చూపించేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నందున అరెస్టు చేయలేకపోయామంటూ పోలీసులు చెబుతున్నారు. కానీ ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు కారణంగానే పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ తరహా బుకీలు నగరంలో చాలామంది ఉన్నారని చెబుతున్నారు. బెట్టింగ్‌లపై స్థానిక పోలీస్ స్టేషన్‌లోని కొందరు సిబ్బందికి సమాచారం ఉంటుందని, అయితే బుకీలు ముందుగానే వారిని ప్రసన్నం చేసుకోవడంతో వారి జోలికి వెళ్లడం లేదని అంటున్నారు. పెదవాల్తేరులో పట్టుబడిన రవికుమార్ విషయానికి వస్తే, స్థానికంగా ఉన్న కొందరు పక్కా ఆధారాలతో నేరుగా సీపీకి ఫిర్యాదు చేయడం వల్లే అతను పట్టుబడ్డాడని, అదే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే, వారు ముందుగానే వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేసేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ కమిషనర్ ఇప్పటికైనా బెట్టింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించి వీధివీధిన వెలసిన బుకీలకు ముకుతాడు వేయాలని పలువురు కోరుతున్నారు.