Share News

పూర్ణామార్కెట్‌లో బినామీ దందా

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:00 AM

పూర్ణామార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు నడుస్తున్నాయి.

పూర్ణామార్కెట్‌లో బినామీ దందా

  • ఒక్కొక్కరి చేతిలో నాలుగు నుంచి ఎనిమిది దుకాణాలు

  • రోజుకు రూ.200 నుంచి రూ.300 అద్దె వసూలు

  • జీవీఎంసీకి మాత్రం రూ.32 ఆశీల్‌ చెల్లింపు

  • నిబంధనలకు విరుద్ధం

  • గతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రమే కేటాయింపు

  • కొంతమంది దౌర్జన్యంగా చేజిక్కించుకుంటున్న వైనం

  • అన్నీ తెలిసినా అధికారుల మౌనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పూర్ణామార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు నడుస్తున్నాయి. జీవీఎంసీ గతంలో ఒక్కో వ్యాపారికి ఒక్కో దుకాణాన్ని మాత్రమే కేటాయించగా, కొంతమంది దౌర్జన్యంగా, అధికారుల అండదండలతో నాలుగు నుంచి ఎనిమిది దుకాణాల వరకూ తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఇలా సుమారు పది మంది తాము చేజిక్కించుకున్న దుకాణాలను రోజువారీ అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం జీవీఎంసీ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పూర్ణామార్కెట్‌లో దుకాణాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వాటితోపాటు మార్కెట్‌ లోపల ఖాళీ స్థలాల్లో గ్యారేజీ దుకాణాల పేరుతో మరికొన్ని ఏర్పాటుచేశారు. ఇలా మార్కెట్‌ లోపల అన్నిరకాల దుకాణాలూ కలిపి 430 వరకూ ఉన్నాయి. వీటిని జీవీఎంసీ అధికారులు చాలాకాలం కిందట వ్యాపారులకు కేటాయించారు. మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూరగాయలు, హోల్‌సేల్‌ పండ్ల దుకాణాలు, మసాలా, కిరాణా, డ్రైఫూట్స్‌, పూజా సామగ్రి వంటి వ్యాపారాలకు ఇచ్చారు. కాలక్రమంలో హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ వేరొకచోటకు తరలిపోవడంతో పూర్ణామార్కెట్‌లోని దుకాణాలను ఖాళీ చేసి జీవీఎంసీకి అప్పగించేశారు. ఆ దుకాణాలను జీవీఎంసీ అధికారులను ప్రసన్నం చేసుకుని అప్పటికే మార్కెట్‌లో దుకాణాలు కలిగి ఉన్న కొందరు బినామీ పేర్లతో కైవసం చేసుకున్నారు. అలాగే మార్కెట్‌లో ఎవరైనా వ్యాపారం మానేసినట్టయితే ఆ దుకాణాన్ని జీవీఎంసీకి అప్పగించాల్సి ఉన్నప్పటికీ నాయకులుగా చలామణి అయినవారు, రాజకీయ నేతల వెంట తిరుగుతూ దందాలు చేసేవారు దౌర్జన్యంగా వాటిని బినామీల పేర్లతో చేజిక్కించుకున్నారు. ఇలా మార్కెట్‌లో సుమారు 80 దుకాణాలు పది మంది చేతిలో బినామీ పేర్లతో ఉన్నట్టు వ్యాపారులే చెబుతున్నారు. ఆయా దుకాణాలకు జీవీఎంసీకి రోజుకు రూ.25 నుంచి రూ.35 ఆశీల్‌ చెల్లిస్తూ, ఇతర వ్యాపారులకు రూ.200 నుంచి రూ.300 అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ఇలా బినామీలు ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పూర్ణామార్కెట్‌ ప్రహరీని ఆనుకుని మెయిన్‌రోడ్డు వైపు వాటర్‌ ట్యాంకు ఉండేది. ఆ ట్యాంకు నిరుపయోగంగా ఉండడంతో ఆ ప్రాంతంలో రెండు అగరవత్తుల దుకాణాలకు జీవీఎంసీ అధికారులు అనుమతి ఇచ్చారు. దీనిని గుర్తించి మార్కెట్‌లో దందా చేసే ఒక దళారీ ఆ రెండు దుకాణాల మధ్యలో ఒక దుకాణం ఏర్పాటుచేసి వేరొకరికి రోజుకు రూ.200కి అద్దెకు ఇచ్చాడు. దీనిపై అగరవత్తుల వ్యాపారులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ దుకాణం తొలగించాలని ఆదేశించగా...దళారీ పెద్ద హడావిడి చేశాడు. దీంతో అధికారులే వెనక్కి తగ్గి ఆ దుకాణానికి బినామీ పేరుతో ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా జారీచేసినట్టు మార్కెట్‌లోని వ్యాపారులు చెబుతున్నారు.

అదేవిధంగా జీవీఎంసీ అధికారులు ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా ప్రత్యామ్నాయ బ్యాగ్‌లు విక్రయించేందుకు పూర్ణామార్కెట్‌ మెయిన్‌ రోడ్డులో ఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. కానీ తర్వాత అక్కడ ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ బ్యాగ్‌ల విక్రయం నిలిచిపోయింది. మార్కెట్‌లో బినామీ పేర్లతో అనేక దుకాణాలను చేజిక్కించుకున్న ఓ దళారీ ఇటీవల దానిముందు ఒకరితో దుకాణం పెట్టించి రోజుకి రూ.200 అద్దె వసూలు చేస్తున్నారు. బినామీ పేర్లతో దుకాణాలను కొంతమంది చేజిక్కించుకుంటున్న విషయంం జీవీఎంసీ జోన్‌-4 అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడానికి మాత్రం ముందుకురావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. అధికారులకు వాటాలు అందుతుండడంతో ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్‌లో దందా చేస్తున్న మరొకరు ఐదు దుకాణాలను చేతిలోపెట్టుకుని అద్దెలకు ఇస్తున్నాడని, పైగా మార్కెట్‌లో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణను ఒక మహిళకు అప్పగించి, ఆమె నుంచి నెలకు రూ.ఐదు వేలు కమీషన్‌ తీసుకుంటున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆశీల్‌ వసూలు నుంచి, దుకాణాలను బినామీ పేర్లతో గుప్పిట్లో పెట్టుకోవడం వరకూ అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. పూర్ణామార్కెట్‌ ప్రక్షాళనకు జీవీఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా నడుంబిగిస్తారో లేదో చూడాలి.

Updated Date - Feb 07 , 2025 | 01:00 AM