Share News

పూర్ణామార్కెట్‌లో బినామీల దందా!

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:53 AM

నగరంలో ప్రఖ్యాతిగాంచిన పూర్ణామార్కెట్‌ (సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌) దళారుల కబందహస్తాల్లో చిక్కుకుంది.

పూర్ణామార్కెట్‌లో  బినామీల దందా!

  • ఒక్కొక్కరి చేతిలో నాలుగు నుంచి పది షాపులు

  • ఒక్కో దుకాణానికి జీవీఎంసీకి రూ.31 ఆశీలు చెల్లింపు

  • వ్యాపారులకు రోజుకి రూ.200 నుంచి రూ.300 అద్దెకు..

  • దళారులకు అండగా వార్డులోని శానిటేషన్‌ ఉద్యోగి

  • ఎవరైనా దుకాణం వదులుకుంటే మరికరికి అప్పగింత

  • ప్రతిగా రూ.లక్ష ముడుపులు

  • పట్టించుకోని జీవీఎంసీ జోన్‌-4 అధికారులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో ప్రఖ్యాతిగాంచిన పూర్ణామార్కెట్‌ (సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌) దళారుల కబందహస్తాల్లో చిక్కుకుంది. మార్కెట్‌లోని దుకాణాలను బినామీ పేర్లతో తమ గుప్పిట్టో పెట్టుకుని ఇతరులకు రోజువారీ అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన వార్డు శానిటేషన్‌ ఉద్యోగి ఒకరు వారికి అండగా నిలుస్తుండడంతో దళారుల దందాకు అడ్డులేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వారికి మార్కెట్‌లో దుకాణాల్లేక దళారులకు భారీగా అద్దె చెల్లించాల్సి వస్తోంది.

పూర్ణామార్కెట్‌లో మొత్తం 400కు పైగా దుకాణాలున్నాయి. ఇవికాకుండా దుకాణాల వరుస మధ్యలో ఏర్పాటుచేసిన గ్యాంగ్‌వేజ్‌ దుకాణాలు మరో 600 వరకు ఉంటాయి. వీటన్నింటిని వ్యాపారులకు ఒక్కొక్కటి చొప్పున జీవీఎంసీ అధికారులు గతంలోనే కేటాయించారు. ప్రతి దుకాణం నుంచి రోజుకు రూ.31 చొప్పున జీవీఎంసీకి ఆశీలు చెల్లించాలి. అయితే దుకాణం దక్కించుకున్న వారిలో కొందరు మరణించడం, తీవ్ర అనారోగ్యానికి గురవడం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో వాటిని విడిచిపెడుతుంటారు. వారి నుంచి జీవీఎంసీ అధికారులు దుకాణాలను స్వాధీనం చేసుకుని అర్హులైన వ్యాపారులకు ప్రాధాన్యత మేరకు కేటాయించాలి. కానీ ఎవరైనా దుకాణం వదిలేయాలనుకుంటే ముందుగా జోన్‌-4 పరిధిలో వార్డు శానిటేషన్‌ విభాగం ఉద్యోగికి సమాచారం ఇస్తుంటారు. ఆయా దుకాణలను స్వాధీనం చేసుకోకుండా తనకు రూ.లక్ష ఇచ్చేవారికి అప్పగించి, పాతవారికి కొంతమొత్తం ఇప్పించేలా అతడు సెటిల్‌మెంట్‌ చేస్తున్నాడు. అదే దుకాణాన్ని శానిటేషన్‌ అధికారిని ప్రసన్నం చేసుకున్న వారికి లేదంటే అతని బినామీలకు బదలాయిస్తున్నారు. మార్కెట్‌లో రుబాబు చేసే కొందరు వ్యాపారులు శానిటేషన్‌ అధికారి బలహీనతను ఆసరాగా తీసుకుని మార్కెట్‌లో ఖాళీ అయ్యే దుకాణాలను తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఓ వ్యక్తి ఏదో ఒక అసోషియేషన్‌ పేరుతో హడావుడి చేస్తూ డీ సెక్షన్‌లోని ఆరు దుకాణాలు, సీ సెక్షన్‌లో ఒక దుకాణం, గ్యాంగ్‌వేజ్‌లో ఐదు దుకాణాలు, తావేజిలు కట్టే వరుసలో ఒక దుకాణాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నారు. మార్కెట్‌లో వ్యాపారం చేసే మరో వ్యక్తికి గ్యాంగ్‌వేజ్‌లో ఆరు దుకాణాలు, బి సెక్షన్‌లో రెండు, చేపలమార్కెట్‌లో ఒక దుకాణం ఉన్నాయి. మరో దళారీ పీ సెక్షన్‌లో మూడు, గ్యాంగ్‌వేజ్‌లో మూడు దుకాణాలు తన చేతిలో ఉంచుకున్నారు. కిరాణా దుకాణం నడిపే ఓ వ్యక్తి బి సెక్షన్‌లో మూడు దుకాణాలను కలిగి ఉన్నారు. ఇలా మరికొందరు రెండుకంటే ఎక్కువ దుకాణాలను చేజిక్కించుకుని వాటిని ఇతర వ్యాపారులకు అద్దెలకిచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అక్కడే ఉండి ప్రత్యక్షంగా పరిశీలించే వార్డు శానిటేషన్‌ ఉద్యోగికి తెలిసినా అభ్యంతరం చెప్పకపోవడం విశేషం.

బినామీల సమాచారం సేకరించాం

మార్కెట్‌లో కొంతమంది పదుల సంఖ్యలో దుకాణాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే సమాచారం ఉంది. దీనిపై ఆధారాలు సేకరిస్తున్నాం. దుకాణాలను రోజువారీ అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్న దళారుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఒకరికి ఒక దుకాణం మాత్రమే ఉండేలా ప్రక్షాళన చేస్తాం.

- ఎం.మల్లయ్యనాయుడు, జోన్‌-4 కమిషనర్‌

Updated Date - Feb 12 , 2025 | 12:53 AM