బాబోయ్ బడి ఆటోలు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:20 AM
కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నారు. ముఖ్యంగా బడి పిల్లలను తీసుకెళ్లే ఆటోల పరిస్థితి మరింత దారుణంగా వుంటున్నది. ముగ్గురు ప్రయాణించాల్సిన ఆటోలో పది మంది విద్యార్థులను, ఆరుగురిని తీసుకెళ్లాల్సిన ఆటోలో 15-20 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు. స్కూల్ బాగులు, భోజనం క్యారేజీలు, వాటర్ బాటిళ్లతో పిల్లలు ఆటోల్లో ఇరుక్కుని వెళ్లాల్సి వస్తున్నది. రవాణా, పోలీసు శాఖల అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన పాపానపోలేదు.

పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్న డ్రైవర్లు
ఒక్కో ఆటోలో ఆరుగురు పిల్లలను మాత్రమే తీసుకెళ్లాలని నిబంధన
చిన్న ఆటోలో పది మంది, పెద్ద ఆటోలో 15-20 మంది వరకు తరలింపు
వెనుక వైపు జైలు ఊచలు మాదిరిగా గ్రిల్స్
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
కొరవడిన రవాణా, పోలీసు అధికారుల తనిఖీలు
అనకాపల్లి రూరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నారు. ముఖ్యంగా బడి పిల్లలను తీసుకెళ్లే ఆటోల పరిస్థితి మరింత దారుణంగా వుంటున్నది. ముగ్గురు ప్రయాణించాల్సిన ఆటోలో పది మంది విద్యార్థులను, ఆరుగురిని తీసుకెళ్లాల్సిన ఆటోలో 15-20 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు. స్కూల్ బాగులు, భోజనం క్యారేజీలు, వాటర్ బాటిళ్లతో పిల్లలు ఆటోల్లో ఇరుక్కుని వెళ్లాల్సి వస్తున్నది. రవాణా, పోలీసు శాఖల అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన పాపానపోలేదు.
జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని పాఠశాలల యాజమన్యాలు బస్సులు నడుపుతున్నప్పటికీ అవి కొన్ని రూట్లలో మాత్రమే తిరుగుతుండడంతో మిగిలిన ప్రాంతాల విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇంటి నుంచి పాఠశాలకు ఉన్న దూరాన్ని బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు ఇంత అని డ్రైవర్లు వసూలు చేస్తుంటారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం సాధారణ ఆటోలో పెద్ద వాళ్లు అయితే ముగ్గురు, చిన్నపిల్లలు అయితే ఆరుగురు, పెద్ద ఆటోల్లో పెద్ద వారైనా, పిల్లలైనా ఆరుగురే ప్రయాణించాలి. కానీ ఆటోలకు వెనుక సీటు మందు చెక్క బెంచీ ఏర్పాటు చేసి పది మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు. ఇకపెద్ద ఆటోల్లో అయితే లగేజీ పెట్టుకుని వెనుకభాగంలో కూడా పిల్లలను కూర్చోబెడుతున్నారు. మొత్తంగా 15 నుంచి 20 మంది వరకు విద్యార్థులను కుక్కుతున్నారు. మరికొంతమంది డ్రైవర్లు తమకు ఇరువైపులా ఇద్దరిని కూర్చోబెట్టుకుంటున్నారు. ఇక పుస్తకాల బ్యాగులు, భోజనం క్యారియర్లు, వాటర్ బాటిళ్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తున్నది. బ్యాగులను ఆటోకి ఇరువైపులా తగిస్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలో నిబంధనల మేరకు పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులు ఎవరైనా చెబితే.. మీరు ఇచ్చే డబ్బులకు ఆ విధంగా పిల్లలను తీసుకెళ్లి తమకు గిట్టుబాటు కాదని డ్రైవర్లు చెబుతున్నారు. కాగా పలు ఆటోలు ఉదయం, సాయంత్రం విద్యార్థులతో కిక్కిరిసి ప్రధాన రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నప్పటికీ రవాణా, పోలీసు శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు.
కేసులు నమోదు చేస్తాం
కేవీ ప్రకాశ్, ఎంవీఐ, అనకాపల్లి
రవాణా శాఖ నిబంధలను పాటించేలా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాం. పరిమితికి మించి ప్రయాణికులను.. ముఖ్యంగా విద్యార్థులను తీసుకెళ్లితే కేసులు నమోదు చేస్తాం. మద్యం సేవించి వాహనాలను నడిపితే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తాం.