పరవాడ ఎంపీడీవోపై వేటు
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:03 AM
స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎస్‌డీ శ్యామ్‌సుందర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కలెక్టర్ బుధవారం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ దురుసుగా ప్రవర్తించి, సంబంధం లేని సమాధానాలు చెప్పడాన్ని కలెక్టర్ గుర్తించారు.

శ్యామ్‌సుందర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
వీడియో కాన్ఫరెన్స్‌లో దురుసు ప్రవర్తన, పొంతనలేని సమాధానాలు ఇచ్చారని అభియోగం
పరవాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎస్‌డీ శ్యామ్‌సుందర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కలెక్టర్ బుధవారం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ దురుసుగా ప్రవర్తించి, సంబంధం లేని సమాధానాలు చెప్పడాన్ని కలెక్టర్ గుర్తించారు. ఇతని వ్యవహారశైలిపై అనుమానం వచ్చి.. విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పరవాడ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి సిబ్బందిని విచారించారు. డీఎంహెచ్‌వో సమక్షంలో ఎంపీడీవో శ్యామ్‌సుందర్ నుంచి రక్త నమూనాలను సేకరించారు. దీనిపై ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీని ఆధారంగా ఎంపీడీవోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో నుంచి సేకరించిన రక్త నమూనాల నుంచి మద్యం వాసన వస్తున్నట్టు గుర్తించి, విశాఖపట్నంలోని ఆర్‌ఎఫ్‌ఎస్ ల్యాబ్‌కు పంపారు.
సిబ్బందిపై వేధింపులు
సస్పెన్షకు గురైన పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్, మద్యం సేవించి విధులకు హాజరవుతుంటారని, తమను వేధిస్తుంటారని మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది వాపోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దుర్భాషలాడుతుంటారని ఆరోపిస్తున్నారు. ఇతని వేధింపులు భరించలేక ఇటీవల ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవోను తన నివాసానికి పిలిపించి ఆమె మందలించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఎంపీడీవో తీరు మార్చుకోలేదు. పైగా సిబ్బంది పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో మద్యం మత్తులో ఇక్కడ కార్యాలయానికి చేరుకున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాను అడిగిన ప్రశ్నలకు పరవాడ ఎంపీడీవో పొంతన లేని సమాధానం చెప్పడంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసి, ఇతనిపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఎంపీడీవో శ్యామ్‌సుందర్ గురువారం కొంతమంది ఉద్యోగులకు (సస్పెండ్ కాకముందు) ఫోన్ చేసి దుర్భాషలాడినట్టు తెలిసింది.