‘అరకు ఉత్సవ్’కు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:03 AM
ఈనెల 31 నుంచి మూడు రోజులు జరిగే ‘అరకు ఉత్సవ్’కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు
కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
మారథాన్, కార్నివాల్, సైకిలింగ్ నిర్వహించాలి
ప్రచారానికి ఉత్సవ్ బ్లాగ్ ఏర్పాటు చేయాలి
పాడేరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఈనెల 31 నుంచి మూడు రోజులు జరిగే ‘అరకు ఉత్సవ్’కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంపై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అరకు ఉత్సవ్‌కు వివిధ రాష్ట్రాల గిరిజన కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని, అలాగే మారథాన్, కార్నివాల్ నిర్వహించాలని, బొర్రా నుంచి అరకులోయలో సైక్లింగ్, మొక్కలు నాటడడం వంటివి చేపట్టాలన్నారు. అరకు ఉత్సవ్‌పై ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. అందుకు గానూ అరకు ఉత్సవ్ బ్లాగ్ ఏర్పాటు చేసి ప్రోమోతోపాటు ఎప్పటికప్పుడు కార్యక్రమాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ఉత్సవ్‌కు విచ్చేసే పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేలా అన్ని రకాల ప్రదర్శనలు, ఏర్పాట్లు, ఫుడ్ కోర్టులు వంటివి సమకూర్చాలన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించండి
జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లోని సదుపాయాలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న సదుపాయాలను గుర్తించాలన్నారు. అలాగే సందర్శకుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై తనకు సమగ్ర నివేధిక సమర్పించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలుంటే నెల రోజుల్లో సరిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శార్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, టూరిజం జిల్లా మేనేజర్ పి.జగదీశ్వరరావు, అల్లూరి స్మారక మ్యూజియమ్ క్యూరేటర్ డాక్టర్ శంకరరావు, జిల్లా టూరిజం అధికారి జి.దాసు, అరకులోయ గిరిజన మ్యూజియమ్ మేనేజర్ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.