Share News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:12 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత ఆదేశించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, డీఆర్‌వో పద్మలత

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత ఆదేశం

పాడేరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత ఆదేశించారు. ఏలూరు నుంచి గురువారం జిల్లా కలెక్టర్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని, ఎన్నికలకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్‌ రూం ఏర్పటు చేయాలని సూచించారు. ఎన్నికల పీవోలు, ఏపీవోలను నియమించారా?, లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల నిర్వహణపై తగిన శిక్షణ అందించాలని ఆమె పేర్కొన్నారు.

18, 24 తేదీల్లో ఎన్నికలపై శిక్షణ

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల 18, 24 తేదీల్లో అధికారులు, సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 20న సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇస్తామని, ఎన్నికల కోసం 14 మంది నోడల్‌ అధికారులను నియమించామని ఆయన చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమశాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు, నోడల్‌ అధికారులు జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం బి.గణేశ్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎంబీ అప్పారావు, సూపరింటెండెంట్‌ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:12 PM