మరో హనీ ట్రాప్ కేసు
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:13 AM
విశాఖ నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో బాధితుడు శ్రీకాకుళం జిల్లావాసి.

పోలీసుల అదుపులో మహిళ, నలుగురు పురుషులు..పరారీలో మరో ఇద్దరు
బాధితుడు శ్రీకాకుళం జిల్లా వాసి
భీమునిపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో బాధితుడు శ్రీకాకుళం జిల్లావాసి. ఈ కేసులో ఓ వివాహితతో పాటు, సహకరించిన నలుగురిని శుక్రవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు...
నగరంలోని కంచరపాలేనికి చెందిన వివాహిత (34), విజయనగరం కొత్త అగ్రహారానికి చెందిన డోలా లక్ష్మణ్, ఇంటి సురేష్, బంగారు చక్రధర్, నగరంలోని ఉషోదయ జంక్షన్‌కు చెందిన ములపర్తి వెంకటేష్, పెదవాల్తేరుకు చెందిన మరో ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఆమె ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపేవారు. ఈ విధంగా ఈనెల 18న శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వెల్డర్ ఒకరికి ఫోన్ చేసి, మాయమాటలతో పడగొట్టారు. తాను 19న విశాఖ వస్తానని, కలుద్దామని ఆయన చెప్పారు. దీంతో ఆరోజు ఆమె ఫోన్ చేసింది. అయితే తాను తన కుమార్తెను బోయిపాలెం వద్ద హాస్టల్‌లో దింపేసి వెళ్లిపోతున్నానని చెప్పడంతో, కలుద్దామనుకున్నాం కదా అలా ఎలా వెళ్లిపోతారని వివాహిత ప్రశ్నించింది. దీంతో ఆయన తగరపువలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్ద ఆటో దిగిపోతానని, అక్కడ కలుద్దామని చెప్పడంతో సరేనంది. ఆయన అక్కడ దిగి నిరీక్షిస్తుండగా మూడు బైకులపై ఆరుగురు వ్యక్తులు వెళ్లి...తమ బంధువైన మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నావంటూ బైక్‌పై బలవంతంగా ఎక్కించుకని విజయనగరం వైపు తీసుకువెళ్లారు. రఘు కాలేజీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బైకులు ఆపి ఆయన్ను చితగ్గొట్టారు. జేబులో ఉన్న రూ.50 వేలు, ఏటీఎం కార్డులు తీసుకున్నారు. సెల్‌ఫోన్ నుంచి రూ.8,900 తమకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించి, అతడిని అక్కడే వదిలేసి సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. ఆయన షర్టు జేబులో మిగిలిన రూ.500తో ఇంటికి వెళ్లిపోయాడు. ముఖం కమిలిపోయి, వంటినిండా దెబ్బలు ఉండడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని వివరించాడు. ఈనెల 22న భీమిలి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విశాఖ నార్త్ క్రైమ్ సీఐబీఎస్‌ఎన్ ప్రకాశ్ పర్యవేక్షణలో భీమిలి ఎస్‌ఐ సూర్యప్రకాశరావు, ఆరు బృందాలు నిందితుల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్, సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకుని వారి నుంచి మూడు బైకులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పూర్తి వివరాలు ఉన్నతాధికారులు నగరంలో మీడియాకు తెలియజేస్తారని, కేసు దర్యాప్తులో ఉందని భీమిలి ఎస్‌ఐ సూర్యప్రకాశరావు తెలిపారు. నగరంలో రెండు నెలల క్రితం ఓ హనీ ట్రాప్ కేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఫ్రీ హోల్డ్ భూములపై విజిలెన్స్
పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు
పెందుర్తి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో శుక్రవారం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రేవతి తనిఖీలు చేశారు. పెందుర్తి రెవెన్యూ పరిధిలో శాశ్వత హక్కులు (ఫ్రీహోల్డ్) జారీ అయిన భూముల దస్ర్తాలను పరిశీలించారు. మండలంలోని జెర్రిపోతులపాలెం, నరవ, చింతగట్ల, ఎస్.ఆర్.పురం గ్రామాల్లో 18 మంది పేరిట సుమారు ఇరవై ఎకరాలకు ఫ్రీహోల్డ్ పత్రాలు జారీ అయినట్టు ఆమె గుర్తించారు. అనుమతులు పొందిన భూములపై విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకుని, ఆ తరువాత తమ పలుకుబడిని ఉపయోగించి ఫ్రీహోల్డ్ అనుమతులు పొందారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డ్డీ కింజారపు ప్రభాకర్ ఆదేశాల మేరకు ఫ్రీహోల్డ్ భూములపై విజిలెన్ప్ విచారణ చేపట్టామని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రేవతి తెలిపారు. దస్త్రాలు తనిఖీ చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు.