Share News

సీఎంకు వినతుల వెల్లువ

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:21 AM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఉదయం పలువురు జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వినతిపత్రాలు అందజేశారు.

సీఎంకు వినతుల వెల్లువ

  • నిలిచిపోయిన ఇంటర్య్వూలు నిర్వహించాలని అసిస్టెంట్‌ ఆచార్యుల స్ర్కీనింగ్‌ పరీక్షల అర్హత అభ్యర్థులు

  • నజీర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరిన ఉత్తరాంధ్ర మసీదుల కమిటీ సభ్యులు

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఉదయం పలువురు జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వినతిపత్రాలు అందజేశారు. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం అర్ధరాత్రి సీఎం నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేశారు. గురువారం ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గీతం విశ్వవిద్యాలయానికి బయలుదేరబోతుండగా ఆయనకు పలువురు వినతిపత్రాలు అందజేసి, గోడు చెప్పుకున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి 2017లో నిలిచిపోయిన ఇంటర్వ్యూలు నిర్వహించాలని అసిస్టెంట్‌ ఆచార్యుల స్ర్కీనింగ్‌ పరీక్షల అర్హత అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల మంది పరీక్ష రాయగా, ఇంటర్వ్యూలకు 3,436 మంది అర్హత సాధించారన్నారు. రాత పరీక్షలో విజయం సాధించిన తమకు ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన న్యాయం చేయాలని కోరారు. అలాగే 2020 ఫిబ్రవరిలో విపక్ష నేతగా ఉన్న తమ (చంద్రబాబునాయుడు)పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ కె.గోపాల్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేసినా, ఇంతవరకూ దర్యాప్తు చేయలేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఉత్తరాంధ్ర మసీదుల కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కాగా 55వ వార్డు పరిధి రెడ్డికంచరపాలెంలో ప్రభుత్వం ఇచ్చిన 60 గజాల స్థలంలో పైఅంతస్థు నిర్మాణానికి సచివాలయ సిబ్బంది అడ్డుపడుతున్నారని, లంచం ఇవ్వాలని పదేపదే వేధిస్తున్నారని మైలపల్లి హరిబాబు అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని ఎంపీ ఎం.శ్రీభరత్‌, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర హౌసింగ్‌, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, గవర, వెలమ కార్పొరేషన్‌ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్‌, ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వెల్లంకి భరత్‌, సర్వసిద్ధి అనంతలక్ష్మి, తోట రత్నం, ముత్యాలనాయుడు, చిన రెహమాన్‌, తదితరులు కలిశారు.

ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు

గోపాలపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

నగర పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పార్టీ నేతలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గురువారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఎంపీలు శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, సీపీ శంఖబ్రత బాగ్చీ, ఆర్డీవో పి.శ్రీలేఖ, డీసీపీ మేరీ ప్రశాంతి, తదితరులు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Updated Date - Mar 07 , 2025 | 01:21 AM