Share News

నామినేషన్లన్నీ ఓకే

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:52 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు అధికారుల ఆమోదం పొందాయి.

నామినేషన్లన్నీ ఓకే

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పరిశీలన

13న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణకు అవకాశం

మొత్తం ఓటర్లు 22,493 మంది

పరిశీలకుడు ఎంఎం నాయక్‌, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

మహారాణిపేట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు అధికారుల ఆమోదం పొందాయి. కలెక్టరేట్‌లో మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థులందరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధర ప్రసాద్‌ ప్రకటించారు.

ఎన్నికల పరిశీలకుడు ముదావత్‌ ఎం నాయక్‌ ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మంగళవారం ఉదయం నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఈ స్థానానికి మొత్తం పది మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు సమర్పించగా, వాటిలో నాలుగు సెట్లు తిరస్కరించామని, మిగిలినవన్నీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో అన్నింటినీ ఆమోదిస్తున్నామని ప్రకటించారు. కాగా ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులందరితో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా తుది జాబితా మేరకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో డీఆర్వో సీతారామారావు, ఎన్నికల సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:52 AM