Share News

బర్డ్‌ ఫ్లూతో అప్రమత్తం

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:09 AM

పొరుగునున్న గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు.

బర్డ్‌ ఫ్లూతో అప్రమత్తం
భీమిలి మండలంలో కోళ్ల ఫారాలు తనిఖీ చేస్తున్న పశు సంవర్థక శాఖ సిబ్బంది

ఫారాలు తనిఖీ చేస్తున్నపశు సంవర్థక శాఖ అధికారులు

గోదావరి జిల్లాల నుంచి కోళ్లు తీసుకురాకుండా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టు

కోడిమాంసం, గుడ్లు బాగా ఉడికించిన తరువాతే తినాలని సూచన

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

పొరుగునున్న గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు.

గోదావరి జిల్లాల నుంచి నగరానికి బ్రాయిలర్‌ కోళ్లు, గుడ్లు సరఫరా అవుతుంటాయి. అలాగే విజయవాడ నుంచి తుని మధ్యనున్న చాలా ప్రాంతాల నుంచి గుడ్లు కోల్‌కతాకు ఎగుమతి చేస్తుంటారు. కోల్‌కతాకు గుడ్లు ఎగుమతి కావడంలో ఇబ్బంది లేకపోయినా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు బ్రాయిలర్‌ కోళ్లు తీసుకురాకుండా చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే గుడ్లు, బ్రాయిలర్‌ కోళ్లను స్థానికంగా వినియోగించుకోవడంతో పాటు ఒడిశాకు ఎగుమతి చేస్తారు. అదే సమయంలో అనకాపల్లి, విశాఖ జిల్లాలకు గోదావరి జిల్లాల నుంచి కోళ్లు, గుడ్లు వస్తుంటాయి. అయితే అక్కడ బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తిచెందడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు రోజుల నుంచి జిల్లాలో పౌలీ్ట్ర ఫారాలను సందర్శించి యజమానులు, అక్కడ పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 20 వరకూ ఫారాలలో 3.44 లక్షల కోళ్లు ఉన్నాయని విశాఖ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ డి.రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదని పేర్కొన్నారు. అయినా ఫారాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చికెన్‌, గుడ్లు తినేవారంతా వాటిని బాగా ఉడికించాలని సూచించారు. తాజాగా వైరస్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో గుడ్లు, చికెన్‌ వినియోగం స్వల్పంగా తగ్గిందని చిల్లర వర్తకులు చెబుతున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 01:09 AM