విమ్స్‌కు అధునాతన వైద్య పరికరాలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:57 AM
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ), ఎండోస్కోపిక్ ఆల్ర్టా సోనోగ్రఫీ (ఈయూఎస్), సిగ్మాయిడో స్కోపీ, సైడ్ వ్యూ ఎండోస్కోపీ, ఈవీఎల్ బాండింగ్ వంటి పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు మెడికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగానికి సమకూరాయి.

పేదలకు ఉచితంగా ఎండోస్కోపీ,
కొలనోస్కోపీ, ఈఆర్‌సీపీ, ఎండోస్కోపిక్ ఆల్ర్టా సోనోగ్రఫీ పరీక్షలు
ఉదరకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణలో కీలకం
మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయన్న వైద్యులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ), ఎండోస్కోపిక్ ఆల్ర్టా సోనోగ్రఫీ (ఈయూఎస్), సిగ్మాయిడో స్కోపీ, సైడ్ వ్యూ ఎండోస్కోపీ, ఈవీఎల్ బాండింగ్ వంటి పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు మెడికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగానికి సమకూరాయి. వీటితో రోగులకు నాణ్యమైన సేవలను అందించగలుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆయా పరీక్షలు ఒక్కొక్కటి బయట చేయించుకోవాలంటే కనీసం రెండు నుంచి ఐదు వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది. విమ్స్‌లో ఉచితంగా చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో విమ్స్‌కు ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లతో ఈ పరికరాలను అందజేసింది.
ఈ సమస్యలతో బాధపడే వారికి..
ఉదరకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ పరికరాల సహాయంతో పరీక్షలు నిర్వహించి మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా అల్సర్ల నిర్ధారణ, గ్యాస్ర్టిక్, పేగులు వరుపు వంటి సమస్యల నిర్ధారణకు ఎండోస్కోపీ, పెద్దపేగు సమస్యలను గుర్తించడానికి, పేగు కేన్సర్లు, ఫిస్టులాతోపాటు మరిన్ని సమస్యలను నిర్ధారించేందుకు కొలనోస్కోపీ చేస్తారు. అలాగే పాంక్రియాస్ కేన్సర్, స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, పచ్చకామెర్లు నిర్ధారణకు ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) పరీక్ష చేస్తారు. సూక్ష్మ కణితుల నిర్ధారణ, కొన్నిరకాల కేన్సర్ కారకాల నిర్ధారణకు ఎండోస్కోపిక్ ఆల్ర్టా సోనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. వీటితోపాటు మరిన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు సిగ్మాయిడో స్కోపీ, సైడ్ వ్యూ ఎండోస్కోపీ పరీక్షలు చేస్తారు. ఈ పరికరాల సహాయంతో ఇప్పటివరకూ 864 మందికి ఎండోస్కోపీ, 45 మందికి ఈయూఎస్, 546 మందికి కొలనోస్కోపీ, సిగ్మాయిడో స్కోపీ 546 మందికి, 63 మందికి ఈఆర్‌సీపీ పరీక్ష నిర్వహించారు.
మెరుగైన సేవందించేందుకు దోహదం
ప్రభుత్వం అందించిన అడ్వాన్స్‌డ్ పరికరాల సహాయంతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించగలుగుతున్నాం. జీర్ణకోశం, అన్నవాహిక, కడుపులో అల్సర్లు, కేన్సర్లను గుర్తించడంలో ఈ పరికరాలు కీలకంగా మారుతున్నాయి. పెద్దపేగు కేన్సర్లు, ట్యూమర్లను గుర్తిస్తున్నాం. ప్రతిరోజూ ఆయా పరికరాల సహాయంతో ఐదుగురికి అయినా పరీక్షలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఉంది.
- డాక్టర్ కె.రాంబాబు, విమ్స్ డైరెక్టర్