ప్రభుత్వ భూముల్లో రోడ్ల నిర్మాణంపై చర్యలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:50 AM
స్థానిక మునిిసపాలిటీలోని పెదపల్లి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా రోడ్ల నిర్మాణం చేపట్టిన వైనంపై అధికార యంత్రాగం కదిలింది.

పరిశీలించిన ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు
ముగ్గురిపై కేసు నమోదు
రోడ్డుకు అడ్డంగా గోతులు తవ్వి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
ఎలమంచిలి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిిసపాలిటీలోని పెదపల్లి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా రోడ్ల నిర్మాణం చేపట్టిన వైనంపై అధికార యంత్రాగం కదిలింది. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘ప్రభుత్వ భూముల్లో దర్జాగా రోడ్ల నిర్మాణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి నీరుపారుదల, అటవీ శాఖల అధికారులు స్పందించారు. అటవీ సెక్షన్ అధికారి బి.వి.రమణ, సిబ్బందితో అక్కడకు వెళ్లి చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతం మీదుగా ఎవరూ రాకపోకలు సాగించకుండా ఎక్స్‌కవేటర్‌ంతో రోడ్డు మధ్యలో గొయ్యి తవ్వించి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అటవీ భూముల్లో కాలిబాటను చదును చేసి చేపట్టిన మట్టి రోడ్డు నిర్మాణంపై ప్రాథమిక దర్యాప్తు జరిపి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా నీటిపారుదల శాఖ డీఈ సాయి ప్రశాంతి, ఏఈ రామకృష్ణ శేషుగెడ్డ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించారు. పెదపల్లి నుంచి రిజర్వాయర్‌కు వెళ్లే మార్గంలో అనధికారికంగా వేసిన మెటల్ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణం చేపట్టిన చోట గొయ్యి తవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు డీఈ వద్దకు వచ్చి, తమ కోరిక మేరకే రోడ్డు నిర్మిస్తున్నారని, ఇందులో తప్పుపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం వల్ల రవాణా సదుపాయం మెరుగుపడుతుందగన్నారు. ఇందుకు డీఈ స్పందిస్తూ.. అనుమతులు లేకుండా మెటల్ రోడ్డు నిర్మించకూడదని స్పష్టం చేశారు.