Share News

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలు?

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:14 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లో గతంలో విధులు నిర్వహించినప్పుడు అవినీతి ఆరోపణులు ఎదుర్కొన్న పలువురు అధికకారులు, ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వీరిలో అత్యధికులు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు 2022 ఆగస్టు నాలుగో తేదీన ఇక్కడ కార్యాలయంలో తనిఖీలు చేశారు.

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలు?

భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో అక్రమాలు

రెండున్నరేళ్ల క్రితం అందిన ఫిర్యాదులపై స్పందించిన ఏసీబీ అధికారులు

జోన్‌ కార్యాలయంలో రికార్డులు తనిఖీ

క్షేత్రస్థాయిలో పలు భవనాలు పరిశీలన

మునిసిపల్‌ పరిపాలన శాఖకు నివేదిక

క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం

అనకాపల్లి టౌన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లో గతంలో విధులు నిర్వహించినప్పుడు అవినీతి ఆరోపణులు ఎదుర్కొన్న పలువురు అధికకారులు, ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వీరిలో అత్యధికులు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు 2022 ఆగస్టు నాలుగో తేదీన ఇక్కడ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇందుకు పట్టణ ప్రణాళికా విభాగం అండదండలు వున్నట్టు నిర్ధారణకు వచ్చి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పనిచేసిన అధికారులు.. తరువాత వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే ఈ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులు కొందరిని రిలీవ్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా అధికారులను గుర్తించి, ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పనిచేసిన అధికారులు, వారికి సహకరించిన సిబ్బందిపై పురపాలక శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

Updated Date - Jan 25 , 2025 | 12:14 AM