సాంకేతికతలో స్వావలంబన సాధించాలి
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:34 AM
దేశాభివృద్ధిలో విద్య, సాంకేతికత, పరిశ్రమ రంగాల మధ్య సమన్వయం అవసరమని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ అన్నారు.

విద్య, సాంకేతికత, పరిశ్రమ రంగాల మధ్య సమన్వయం అవసరం
విశాఖపట్నం ఐఐఎం వ్యవస్థాపక దినోత్సవంలో డీఆర్‌డీవో చైర్మన్ సమీర్ వి.కామత్
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
దేశాభివృద్ధిలో విద్య, సాంకేతికత, పరిశ్రమ రంగాల మధ్య సమన్వయం అవసరమని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ అన్నారు. నగర శివారు గంభీరంలో గల ఐఐఎంవి 11వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామత్ ‘డిఫెన్స్ ఆర్ అండ్ డి -ద రోడ్ ఎహెడ్’ అనే అంశంపై మాట్లాడుతూ ప్రాథమిక పరిశోధన అంటే విద్య, అనువర్తిత పరిశోధన, సాంకేతికత, ఉత్పత్తి అభివృద్ధి (అప్లయిడ్ రీసెర్చ్), పరిశ్రమల మధ్య సమన్వయంలో వెనుకబడి ఉన్నామని పేర్కొంటూ దానిని అధిగమించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ప్రక్రియను నడిపించడంలో సాంకేతిక బదిలీ, పరిశ్రమల సహకారం కీలకమని, దానిని విస్మరించరాదన్నారు. సాంకేతికతలో స్వావలంబన సాధించినప్పుడే దేశం పురోగతి సాధిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రధాని ఆకాంక్షించిన ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐఎం గవర్నింగ్ బాడీ సభ్యురాలు మాళవిక ఆర్.హరిత మాట్లాడుతూ ‘విద్యా పరమ దైవతం (జ్ఞానం అత్యున్నత దేవత)’ అని భర్తృహరి రాసిన నీతి శతకంలో పదబంధాన్ని ప్రస్తావిస్తూ విద్య ప్రాధాన్యం వివరించారు. విద్య, జ్ఞానం, అభివృద్ధి, సామరస్యం, పురోగతిని పెంపొందించడంలో ఐఐఎంవి ముందువరుసలో ఉండాలని ఆకాక్షించారు. ఐఐఎం డైరెక్టర్ డాక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ గడచిన పదేళ్లుగా అన్ని ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందన్నారు. సంస్ధలు/పరిశ్రమలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా విద్యార్థులలో నాయకత్వ లక్ష్యాలు పెంపొందించేలా వారిని తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది విద్యార్థినీ, విద్యార్థులకు డాక్టర్ కామత్ ప్రశంసాపత్రాలతోపాటు గ్రాంట్లు అందజేశారు. సంస్థ డీన్ ఆచార్య కావేరి కృష్ణణ్ స్వాగతం పలకగా అకడమిక్ డీన్ ఎం.విజయభాస్కర్ వందన సమర్పణ చేశారు.