Share News

పక్కాగా భూముల రీసర్వే

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:50 AM

జిల్లాలో భూముల రీసర్వే కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలకు ఎంపిక చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ వెల్లడించారు.

పక్కాగా భూముల రీసర్వే

పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలు ఎంపిక

ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు

ఏప్రిల్‌కల్లా జిల్లాలో రీసర్వే పూర్తి

జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

అర్జీలకు పరిష్కారంపై ఆడిట్‌ టీమ్‌

విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో భూముల రీసర్వే కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలకు ఎంపిక చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ వెల్లడించారు. గురువారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 60 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు. మరో 20 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేపట్టాల్సి ఉందన్నారు. అయితే గతంలో వచ్చిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని 20 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పక్కాగా చేపట్టాలని నిర్ణయించామన్నారు. తొలుత ఆనందపురం మండలం గొట్టిపల్లి, భీమిలి మండలం దాకమర్రి, పద్మనాభం మండలం గంధవరం గ్రామాల్లో రీసర్వేకు ఇద్దరేసి సర్వేయర్లు, వీఆర్‌వో, వీఆర్‌ఐతో బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి 200 నుంచి 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా గుర్తించి ఈ టీమ్‌లు సర్వే చేపడతాయన్నారు. జిల్లాలో రీసర్వే పనులు వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయాలని నిర్ణయించామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి బృందాలకు ఆదేశించామన్నారు. తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ కలిసి గ్రామ, బ్లాక్‌ సరిహద్దులతోపాటు, ప్రభుత్వ భూమి, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు, రైతులకు చెందిన భూముల రీసర్వేకు షెడ్యూల్‌ రూపొందిస్తారని అన్నారు. రీసర్వే కోసం రైతులు, ఇతర భూ యజమానులకు ముందుగా నోటీసులు అందజేస్తామని, ఆర్డీవో నేతృత్వంలో గ్రామాల్లో సభలు నిర్వహించి రీసర్వే ప్రాముఖ్యతను వివరిస్తామన్నారు. రైతులు, అధికారులతో కలిసి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి రీసర్వే చేయనున్న తేదీలు పొందుపరుస్తామన్నారు.

జిల్లాలో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారం పక్కాగా జరిగిందా?, లేదా?....అనేది పరిశీలించడానికి జాతీయ రహదారుల విభాగం ఎస్డీసీ నేతృత్వంలో ఒక ఆడిట్‌ టీమ్‌ను ఏర్పాటుచేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. ఈ టీమ్‌లో ప్రతి శాఖకు చెందిన అధికారి ఉంటారన్నారు. అర్జీలకు కచ్చితమైన పరిష్కారం చేయాల్సి ఉందని, దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందన్నారు. భూములకు సంబంధించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కంటే రెవెన్యూ సదస్సుల్లోనే ఎక్కువ అర్జీలు వచ్చాయన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామన్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం వచ్చే అర్జీలను పరిశీలించి పక్కాగా డాక్యుమెంట్లు ఉంటే వెంటనే తహసీల్దారు జారీచేస్తారన్నారు. ఏమైనా తేడా ఉంటే జిల్లా రెవెన్యూ అధికారి వద్ద అప్పీల్‌కు వెళితే ఆయన పరిష్కరిస్తారన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల నుంచి అర్జీలు వచ్చాయని, వాటిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జేసీ అన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 01:50 AM