గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కృషి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:47 PM
జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. గంజాయి నిర్మూలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
డ్రోన్లతో 274 గ్రామాల్లో సర్వే చేసి 82 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేసినట్టు వెల్లడి
పాడేరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. గంజాయి నిర్మూలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్‌తో 274 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో 82 ఎకరాల్లో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేశారన్నారు. వ్యవసాయ, ఉద్యానవనాధికారులు గంజాయి సాగుతో కలిగే నష్టాలపై గిరి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే మేలును వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు వచ్చే రైతులను సంపూర్ణంగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా గంజాయి నష్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి చిన్న చిన్న దుకాణాలు పెట్టించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు డీఅడిక్షన్ సెంటర్లు పటిష్ఠం చేసి, మత్తుకు బానిసైన వారిని గుర్తించి వారిని విముక్తులను చేయాలన్నారు. ఈ ఏడాదిలో గంజాయికి సంబంధించి 208 కేసులు నమోదైనప్పటికీ మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్నదనే సమాచారం ఉందని, గంజాయి సాగును నిర్మూలించేందుకు పోలీస్, ఎక్సైజ్, అటవీశాఖాధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు గంజాయి జోలికి వెళ్లకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టడడంతో పాటు గంజాయి వినియోగం లేకుండా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్, సీపీవో పట్నాయక్, వ్యవసాయ, ఉద్యానవన, విద్య, వైద్యం, అటవీ, రెవెన్యూ, ఎక్సైజ్, ఐసీడీఎస్, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.