పంచాయతీకొక మోడల్ పాఠశాల
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:37 AM
పాఠశాలల విలీనానికి సంబంధించి వైసీపీ హయాంలో తెచ్చిన జీవో నంబర్ 117ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశం
జిల్లాలో 121 పాఠశాలల్లో 60కు మించి విద్యార్థులు
ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విద్యార్థులు
ప్రాథమిక పాఠశాలలకు పంపాలని నిర్ణయం
ఇకపై యూపీ పాఠశాలలు ఉండవు
ఎనిమిది యూపీ పాఠశాలలు హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
పాఠశాలల విలీనానికి సంబంధించి వైసీపీ హయాంలో తెచ్చిన జీవో నంబర్ 117ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే అందుకు 60 మంది పిల్లలు ఉండాలి. విశాఖ జిల్లాలో 60, అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 121 ఉన్నట్టు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా యూపీ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయనున్నారు. ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో 6,7,8 తరగతుల్లో 60కు మించి విద్యార్థులు ఉన్న ఎనిమిది యూపీ పాఠశాలలను హైస్కూళ్లగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి సంబంఽధించి పూర్తిస్థాయి కసరత్తుకు విద్యా శాఖ నిర్ణయించింది.
జిల్లాలో ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్ ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలలు 562 ఉన్నాయి. వీటిలో 69,285 మంది చదువుతున్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, జీవీఎంసీ పరిధిలో 447 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వాటిలో 42 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, 1, 2 తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా మూడు యాజమాన్యాల కింద 29 యూపీ పాఠశాలలుండగా, ఎనిమిదిచోట్ల 60కు మించి విద్యార్థులు ఉన్నారు. ఆ ఎనిమిది పాఠశాలలను హైస్కూళ్లగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. మిగిలిన 21 పాఠశాలల్లో 60 మంది కంటేతక్కువ పిల్లలు ఉన్నందున వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చి అక్కడ చదువుతున్న 6,7,8 తరగతుల పిల్లలను సమీపంలో ఉన్నత పాఠశాలలకు పంపుతారు.
జిల్లాలో 86 ప్రభుత్వ, జడ్పీ, జీవీఎంసీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 40 పాఠశాలల్లో 3,4,5 తరగతులు నిర్వహిస్తున్నారు. వీరంతా గతంలో ఎక్కడ నుంచి వచ్చారో తిరిగి అదే ప్రాథమిక పాఠశాలలకు పంపుతారు. ఈ క్రమంలో ఒక పంచాయతీలో 60 లేదా అంతకుమించి పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకదానిని మోడల్ పాఠశాలగా ఎంపిక చేస్తారు. ఇక 60 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలకు ఐదుగురు చొప్పున (ప్రతి పాఠశాలకు ఒక టీచర్) ఉపాధ్యాయులను ఇస్తారు. ఒకవేళ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 146 ఉంటే ఐదుగురు ఎస్జీటీలు, ఒక హెచ్‌ఎం పోస్టు కేటాయిస్తారు. దీనిపై మండల విద్యాశాఖాధికారులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. జీవో 117 రద్దు నేపథ్యంలో ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఐదు కేటగిరీల పాఠశాలలు రానున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు ఈనెల 20వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.