బీచ్‌లో లైట్‌హౌస్‌ను కూల్చే కుట్ర!
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:20 AM
రామకృష్ణా బీచ్‌లో వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక ఉన్న పాత లైట్ హౌస్‌ను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):
రామకృష్ణా బీచ్‌లో వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక ఉన్న పాత లైట్ హౌస్‌ను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లైట్ హౌస్ చాలా పురాతనమైనది. కొన్ని దశాబ్దాలుగా దీనిని ఉపయోగించడం లేదు. ఈ లైట్ హౌస్‌ను విశాఖపట్నం పోర్టు నిర్మించింది. దాని చుట్టూ ఉన్న భూమి సుమారు 78 సెంట్లు పోర్టు అప్పట్లో కొనుగోలు చేసింది. ఆ భూమి వృథాగా ఉందని దశాబ్దం క్రితం ఓ సంస్థకు లీజుకు ఇచ్చింది. అందులో నిబంధనలు ఏమిటో తెలియదు గానీ ఇప్పుడు ఆ సంస్థ అక్కడ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని యత్నిస్తోంది. దానికి లైట్ హౌస్ అడ్డంగా ఉండడంతో ఏదోవిధంగా కూల్చివేయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఇది పురాతన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా గుర్తించారు. దానిని కాపాడాల్సి ఉంది. కానీ వ్యాపార ప్రయోజనాల కోసం రాత్రికి రాత్రి ఏదోలా కూల్చేయాలని, పాతది కావడంతో కూలిపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు, పురావస్తు శాఖ అధికారులు మేల్కొని దీనిని పరిరక్షించాల్సి ఉంది.