విద్యార్థినుల కష్టాలకు చెక్
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:32 PM
ఎట్టకేలకు ఆరేళ్ల తరువాత అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ డిగ్రీ కో- ఎడ్యుకేషన్ కళాశాలలో మధ్యాహ్నం వేళ మాత్రమే తరగతులు నిర్వహించడంతో విద్యార్థినులు చదువులో వెనుకబడేవారు.

ఎట్టకేలకు అందుబాటులోకి అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల
ఆరేళ్ల క్రితం ప్రారంభమైన భవన నిర్మాణ పనులు
స్థల కేటాయింపు, కొవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు జాప్యం
ఇప్పటి వరకు కో-ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాలలో ఒంటి పూట తరగతులు
రెండు నెలల క్రితం భవన నిర్మాణాలు పూర్తి కావడంతో మహిళా కళాశాల తరలింపు
ప్రస్తుతం రెండు పూటలా తరగతులు జరుగుతుండడంతో విద్యార్థినుల హర్షం
అరకులోయ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఆరేళ్ల తరువాత అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ డిగ్రీ కో- ఎడ్యుకేషన్ కళాశాలలో మధ్యాహ్నం వేళ మాత్రమే తరగతులు నిర్వహించడంతో విద్యార్థినులు చదువులో వెనుకబడేవారు. ఇప్పుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తయి వీరిని అందులోకి తరలించడంతో విద్యార్థినుల కష్టాలు తీరాయి.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూసా నిధులతో మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అరకులోయకు కళాశాలను మంజూరు చేసింది. 2019 ఫిబ్రవరి 2న జమ్ము కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో మహిళా కళాశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా అరకులోయలో కూడా ఆ రోజే పనులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో మహిళా డిగ్రీ కళాశాల భవనం, వసతి గృహం భవన నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన నాడే రూ.6 కోట్ల నిధులు కళాశాల ఖాతాలో జమ చేసింది. అయితే స్థల కేటాయింపు, కొవిడ్ ప్రభావం వల్ల రెండేళ్ల పాటు పనులు జరగలేదు. ఆ తరువాత తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఏపీ ఈడబ్ల్యూసీ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ సన్యాసయ్య పర్యవేక్షణలో రెండు నెలల క్రితం కళాశాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ భవనాలను కళాశాల యాజమాన్యానికి అప్పగించారు.
ఆరేళ్లుగా అరకొర చదువులు
ఆరేళ్ల క్రితం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో అప్పటి నుంచే కో-ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు తరగతులు నిర్వహించారు. అయితే మొదటి నాలుగేళ్లు మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్, టీచింగ్ ఫ్యాకల్టీని మంజూరు చేయకపోవడంతో కో-ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ ఆయన పర్యవేక్షణలో కో-ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకులే బోధన చేసేవారు. దీనిపై విద్యార్థినులు ఆందోళన చేయడంతో రెండేళ్ల క్రితమే ఫ్యాకల్టీని నియమించారు. కాగా ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్(ఫిజిక్స్), కామర్స్ అధ్యాపకులు మాత్రమే రెగ్యులర్ కాగా, మిగిలిన వారంతా కాంట్రాక్టు పద్ధతిలో అన్ని సబ్జెక్టులకు నియమితులయ్యారు.
నూతన భవనాల్లోకి కళాశాల మార్పు
రెండు నెలల క్రితం కళాశాల నూతన భవనాలను అప్పగించడంతో విద్యార్థినులను అందులోకి తరలించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు తెలిపారు. కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలను నూతన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరలో వసతి గృహంలోకి విద్యార్థినులను షిఫ్ట్ చేస్తామన్నారు. ఆరేళ్ల నుంచి అరకొర సౌకర్యాల నడుమ కో-ఎడ్యుకేషన్ కళాశాలలో తరగతులు నిర్వహించామని చెప్పారు. మధ్యాహ్నం పూట మాత్రమే తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థినులు ఇబ్బంది పడేవారని తెలిపారు. కొత్త భవనాల్లోకి కళాశాలను తరలించడం వల్ల రెండు నెలల నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం మాదిరిగా ఉండే సౌకర్యాలతో పాటు ల్యాబ్స్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, తరగతి గదులు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో 37 గదులు అందుబాటులో ఉన్నట్టు ఆయన తెలిపారు. కళాశాలలో 566 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వసతి గృహంలో 18 గదులతో పాటు వంటశాల, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే ప్రహరీ గోడ, పక్కా రహదారి లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు, కలెక్టర్‌కు నివేదించామని ఆయన వెల్లడించారు.