Share News

మన్యంపై మంచు దుప్పటి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:02 PM

మన్యంలో చలి తీవ్రత కొనసాగుతుండడంతో గిరిజనులు వణుకుతున్నారు. ఆదివారం జి.మాడుగులలో 6.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 7.6, డుంబ్రిగుడలో 7.8, జీకేవీధిలో 8.5, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 8.9, పాడేరులో 9.0, పెదబయలులో 9.2, ముంచంగిపుట్టులో 9.9, అనంతగిరిలో 10.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మన్యంపై మంచు దుప్పటి
పాడేరులో ఆదివారం ఉదయం దట్టంగా పొగమంచు

కొనసాగుతున్న చలి తీవ్రత

జి.మాడుగులలో 6.2 డిగ్రీలు

పాడేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతుండడంతో గిరిజనులు వణుకుతున్నారు. ఆదివారం జి.మాడుగులలో 6.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 7.6, డుంబ్రిగుడలో 7.8, జీకేవీధిలో 8.5, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 8.9, పాడేరులో 9.0, పెదబయలులో 9.2, ముంచంగిపుట్టులో 9.9, అనంతగిరిలో 10.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దట్టంగా కమ్మేస్తున్న పొగమంచు

ఏజెన్సీలో ఆదివారం ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. చలి తీవ్ర ప్రభావం చూపడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. గత రెండు వారాలుగా ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కురవడం, మధ్యాహ్నం రెండు గంటలు మాత్రమే మోస్తరు ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం అధికంగానే ఉంది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

వణికించే చలిలో పనులు

చింతపల్లి: కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి విపరీతంగా పెరగడంతో గిరిజనులు వణికిపోతున్నారు. ఉన్ని దుస్తులు ధరించి చలిలోనే పనులు చేసుకుంటున్నారు. మండలంలో ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తున్నది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ వాతావరణం చల్లగా ఉంటోంది. గిరిజనులు 24 గంటలు ఉన్ని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్ల వద్ద, వీధి కూడళ్లలో చలి మంటలు వేసుకుంటున్నారు. సాయంత్రం మూడు గంటలకే ఇంటి ముఖం పడుతున్నారు. కాఫీ తోటల్లో పండ్ల సేకరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. బావులు, బోర్లులేని ప్రాంతాల ప్రజలు చలిలోనే ఊటగెడ్డల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు చలికి అవస్థలు పడుతున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:02 PM