Share News

పచ్చదనానికి పెద్దపీట

ABN , Publish Date - Feb 25 , 2025 | 01:30 AM

పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది.

పచ్చదనానికి పెద్దపీట

  • భారీఎత్తున మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం

  • సామాజిక అటవీ విభాగం ప్రణాళికలు

  • ఈ ఏడాది 34.8 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం

  • రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో నాటడానికి ఏర్పాట్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. హరితాంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ ఆలోచనలకు ఆనుగుణంగా సామాజిక అటవీ విభాగం అధికారులు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. రహదారుల పక్కన, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల కాలనీల ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందకోసం రానున్న వివిధ నర్సరీల్లో 34.8 లక్షల మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం విస్తీర్ణంలో మాత్రమే పచ్చదనం (అడవులు, చెట్లు) వుంది. రానున్న కాలంలో దీనిని 45 శాతానికి పెంచడానికి ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సామాజిక వనాల ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా సామాజిక అటవీ విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది ఎన్‌టీపీసీ సౌజన్యంతో పలు మండలాల్లో 80 వేల మొక్కలు నాటించారు. అనకాపల్లి, చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, మాడుగుల మండలాల్లో రహదారులకు ఇరువైపులా 100 కిలోమీటర్ల పొడవున కానుగ, నేరేడు, మద్ది, నల్లమద్ది, తెల్లమద్ది, వేప, గంగిరావి, సీమబాదం వంటి మొక్కలు వేశారు. అనకాపల్లి మండలం కోడూరు, శంకరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతం, టిడ్కో కాలనీల పరిసరాల్లో సైతం సామాజిక వనాల అభివృద్ధి పనులు చేపట్టారు.

ఈ ఏడాది 34.8 లక్షల మొక్కల పెంపకం

హరితాంధ్రప్రదేశ్‌ రూపకల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఒకవైపు అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు రహదారులకు ఇరువైపులా, పాఠశాలల ఆవరణలు, చెరువులు/ కాలువల గట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరంలో సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో 34.8 లక్షల మొక్కులు నాటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనకాపల్లి, కశింకోట, అచ్యుతాపురం, సబ్బవరం, కె.కోటపాడు, చీడికాడ, మాడుగుల, చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, రావికమతం, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, మాకవరపాలెం మండలాల్లో గ్రామీణ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ఇంకా ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో 40 వేల మొక్కలను 37 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా నాటించనున్నారు.

సామాజిక అడవుల పెంపకంలో భాగంగా తుప్పల తొలగింపు, గోతుల తవ్వకం పనులు జరగుతున్నాయని జిల్లా సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌ఓ జి.లక్ష్మణ్‌ తెలిపారు. ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో గత ఏడాది నాటిన మొక్కలకు సంరక్షణ పనులు చేపడుతున్నామన్నారు. సాధారణ ప్లాంటేషన్‌ ప్రోగ్రాం కింద 1.6 లక్షల మెక్కలు పెంచనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమలు, ఇతరత్రా ప్రైవేటు వ్యక్తులకు కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు విక్రయించేందుకు 10 లక్షల కొబ్బరి మొక్కలు సిద్ధంగా వున్నాయి.

Updated Date - Feb 25 , 2025 | 01:31 AM