గోదావరి డెల్టాకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:47 AM
గోదావరి డెల్టాకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్టు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

- రబీ పంటల కోసం 40 రోజుల పాటు కొనసాగింపు
- ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఇన్‌చార్జి ఎస్‌ఈ బి.చంద్రశేఖర్‌రెడ్డి
సీలేరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గోదావరి డెల్టాకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్టు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు సీలేరు కాంప్లెక్సు నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు జెన్‌కో ఉన్నతాధికారులను కోరడంతో తమ అధికారుల ఆదేశాల మేరకు డొంకరాయి జలాశయం నుంచి 7 నంబర్ గేటు ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి చేయకుండా నేరుగా గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నామన్నారు. 10 టీఎంసీల నీటిని 3 వేల క్యూసెక్కుల చొప్పున 40 రోజుల పాటు అంటే మార్చి 20వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగించాలని ఇరిగేషన్ అధికారులు కోరినట్టు ఆయన తెలిపారు. అలాగే కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కుల నీరు కూడా గోదావరి డెల్టాకు చేరుతుందని ఆయన తెలిపారు. సీలేరు కాంప్లెక్సులో బలిమెల జలాశయం, జోలాపుట్ జలాశయాల్లో ఆంధ్రా వాటాగా 66 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. గత పదేళ్లతో పోలిస్తే ఈసారి బలిమెల, జోలాపుట్ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో నీటి నిల్వలు ఆశా జనకంగా ఉన్నాయని, ఈ ఏడాది వేసవిలో సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటి కొరత లేదని ఇన్‌చార్జి ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.