Share News

అరకొర వేతనాలతో 102 ఉద్యోగుల వెతలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:54 AM

చాలీచాలని వేతనాలతో తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102)ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అరకొర వేతనాలతో 102 ఉద్యోగుల వెతలు

  • కేవలం రూ.7,600 నుంచి రూ.7,800 మాత్రమే చెల్లింపు

  • ఉద్యోగాలు వదిలి వెళ్లిపోతున్న పైలట్లు

  • నిలిచిపోతున్న వాహనాలు

  • కనీసం రూ.18 వేలు అయినా చెల్లించేలా చూడాలని వేడుకోలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చాలీచాలని వేతనాలతో తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102)ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి ఈ వాహనాలకు పైలట్లుగా పనిచేస్తున్న వారికి ఏజెన్సీ సంస్థ కేవలం రూ.7,600 నుంచి రూ.7,800 మాత్రమే చెల్లిస్తోంది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు నిరుపేదలు ఎంతో ఇబ్బందిపడుతుండేవారు. ఈ నేపథ్యంలో ప్రసవం అనంతరం తల్లి,బిడ్డలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి పంపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో తల్లీ, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక సంస్థ ఉండగా, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘అరబిందో’ కాంట్రాక్టు దక్కించు కుంది. ప్రస్తుతం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే వాహనాలు నడుస్తున్నాయి. నిర్వహణ సంస్థలకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందోగానీ...ఉద్యోగులకు మాత్రం ఆశించిన స్థాయిలో వేతనాలు అందడం లేదు. దీంతో ఎంతోమంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోతున్నారు. అందుకే సేవలు సక్రమంగా అందడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటివరకూ ఆరుగురు పైలట్లు ఉద్యోగం మానేసినట్టు చెబుతున్నారు.

102 సిబ్బందిపై చిన్నచూపు

108, 104 వాహనాల మాదిరిగానే 102 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. 108, 104 వాహనాల పైలట్లకు సుమారు రూ.15 వేలు నుంచి రూ.30 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. 102 వాహనాల పైలట్లకు మాత్రం ఏడెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ వాహనాల నిర్వహణ చూస్తున్న అరబిందో కాంట్రాక్టు ఈ నెలతో ముగియబోతోంది. కొత్త సంస్థకు వాహనాల నిర్వహణను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త ఏజెన్సీ అయినా కనీసం రూ.18 వేలు వేతనం చెల్లించేలా చూడాలని పైలట్లు కోరుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడుతోపాటు పలువురు మంత్రులను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు.

అధ్వానంగా నిర్వహణ

నిర్వహణ సరిగా లేకపోవడంతో తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు మార్గమధ్యంలో నిలిచిపోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 67 వాహనాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో 22, విశాఖ జిల్లాలో 23, అల్లూరి జిల్లాలో 22 ఉన్నాయి. వీటిలో అనకాపల్లి జిల్లాలో మూడు, విశాఖ జిల్లాలో రెండు, అల్లూరి జిల్లాలో రెండు వాహనాలు నిర్వహణ లోపంతో నిలిచిపోయాయి. ఇంకొన్ని వాహనాలకు టైర్లు, బ్యాటరీ సమస్యలు ఉన్నాయి. అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి వాహనాల ఇబ్బందులను పరిష్కరించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:54 AM