నగరానికి 100 ఇ-బస్సులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:31 AM
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు అతి త్వరలో వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి.

కూటమి ప్రభుత్వం నిర్ణయం
50 చొప్పున రెండు విడతలుగా రాక
వాల్తేరు, సింహాచలం, గాజువాక డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు
కాలం చెల్లిన 35 బస్సుల తొలగింపునకు నిర్ణయం
ద్వారకాబస్‌స్టేషన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు అతి త్వరలో వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. ఆర్థిక రాజధానిగా గుర్తింపుతెచ్చుకున్న విశాఖలో వీటిని నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఆయా డిపోల్లో చేసుకోవాలని విజయవాడ బస్‌భవన్ నుంచి విశాఖ రీజియన్ అధికారులకు సమాచారం అందింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత ఫస్ట్ ఫేజ్‌లో 50బస్సులు పంపుతామని, రెండో విడత మరో 50 పంపుతామని సమాచారం వచ్చింది.
వచ్చేనెల మొదటి వారం నుంచి మూడు నెలల వ్యవధిలో విశాఖకు ఎలక్టికల్ బస్సులు రానున్నట్టు తెలిసింది. దీంతో రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు సాంకేతిక నిపుణులతో పాటు రీజియన్‌లోని మధురవాడ, విశాఖపట్నం, వాల్తేరు, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, స్టీల్‌సిటీ డిపోలను, గ్యారేజీలను పరిశీలించారు. ఇ-బస్సుల పార్కింగ్‌కు అనువైన స్థలం, బస్సుల నిర్వహణకు అవసరమైన పరికరాలతో గ్యారేజీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. దీనికి వాల్తేరు, సింహాచలం, గాజువాక డిపోలు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపారు.
ప్రస్తుతం విశాఖ రీజియన్‌లోని ఏడు డిపోల్లో 804బస్సులు సేవలందిస్తుండగా, వాటిలో 35 కాలం చెల్లిన బస్సులున్నాయి. 13 లక్షల కిలోమీటర్లు తిరగడం, 15 సంవత్సరాల పాటు రవాణా సేవలు అందించిన బస్సులను కాలం చెల్లినవిగా గుర్తిస్తారు. అవి ప్రయాణికుల రవాణా సేవలకు వినియోగించరాదన్న నిబంధన ఉంది. ఇలాంటి బస్సులు వివిధ డిపోలు, గ్యారేజీల్లో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ బస్సులను రవాణా సేవలనుంచి తొలగించి విజయనగరం సెంట్రల్ గ్యారేజీకి పంపుతామని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. తిరుపతి- తిరుమల మధ్య ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సులతో రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో విశాఖలో వీటిని నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.