Share News

Visakhapatnam Poised to Become Data Center Hub: విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:07 AM

తీర ప్రాంత నగరం విశాఖ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. విశాఖపట్నాన్ని గ్లోబల్‌ డేటా సెంటర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి...

Visakhapatnam Poised to Become Data Center Hub: విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ

  • ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు

  • తాజాగా అదే బాటలో రిలయన్స్‌ కంపెనీ

  • ప్రభుత్వంతో సంప్రదింపుల్లో మరికొన్ని

  • సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ‘మెటా’

  • ఇప్పటికే 3.65 గిగావాట్లకు ఒప్పందాలు

  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం

  • పలు కంపెనీలకు భూకేటాయింపు పూర్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తీర ప్రాంత నగరం ‘విశాఖ’ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. విశాఖపట్నాన్ని గ్లోబల్‌ డేటా సెంటర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే అర డజనుకు పైగా సంస్థలు నగరంలో కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటిని అతి తక్కువ వ్యవధిలో సాకారం చేయడానికి మల్టీ నేషనల్‌ కంపెనీలు చేతులు కలిపి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడుతున్నాయి.

  • విశాఖలో తొలి డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీ గ్రూపు చాలా కాలం క్రితమే శంకుస్థాపన చేసింది. మధురవాడ హిల్‌ నంబరు 4పై 170 ఎకరాల్లో 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు రూ.16 వేల కోట్లు వెచ్చిస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఇటీవలే పర్యావరణ అనుమతులు లభించాయి.

  • ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్‌ అమెరికా వెలుపల అతి పెద్ద పెట్టుబడి రూ.1.35 లక్షల కోట్లతో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఏఐ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనికి అవసరమైన సబ్‌సీ కేబుల్‌ కోసం అదానీ గ్రూపుతో జాయింట్‌ వెంచర్‌ చేసింది. వీరికి ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాలో 580 ఎకరాల భూములు కేటాయించింది. కొద్దిరోజుల్లోనే ఈ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగనుంది.

  • తాజాగా రిలయన్స్‌ సంస్థ కూడా ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ‘డిజిటల్‌ కనెక్షన్‌’ పేరుతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దీని కోసం రిలయన్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌, డిజిటల్‌ రియాల్టీ అనే మూడు సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడ్డాయి. వీరికి ప్రభుత్వం 400 ఎకరాలు కేటాయించనుంది. సుమారు రూ.98 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.

  • సిఫీ టెక్నాలజీస్‌ సంస్థ గత నెలలోనే విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసింది. ఈ కంపెనీకి ప్రభుత్వం రెండుచోట్ల 31.6 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఒక డేటా సెంటర్‌ను రుషికొండ ఐటీ పార్కులో 2027 నాటికే పూర్తి చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థకు కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటులో అనుభవం ఉంది.


  • టిల్‌మేన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌’ సంస్థ 300 మె గావాట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. రూ.15 వేలకోట్లపెట్టుబడి పెట్టనుంది. టీడీజీపీఏ-1 పేరుతో ఏర్పాటయ్యే ఈ కంపెనీకి 40 ఎకరాల కేటాయింపుకు ప్రభుత్వం అంగీకరించింది.

  • ఆస్ట్రేలియా కంపెనీ సంప్రదింపులు

  • మరో పెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 1.2 గిగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేసి, విశాఖపట్నంలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. భూముల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు ఎల్‌ అండ్‌ టీ కంపెనీ భారతదేశంలోని ఐదు ప్రాంతాల్లో ఒక్కొక్కటి 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అందులో ఒకటి విశాఖ కావడం గమనార్హం.

అతిపెద్ద సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌గా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరు గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 3.65 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు ఒప్పందాలు చేసుకుంది. ఇంకా మరికొన్ని సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. అందులో మెటా కూడా ఉంది. సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. తూర్పు తీరంలో విశాఖపట్నం అతి పెద్ద సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌గా మారబోతోంది. కాగా, అమెరికన్‌ కంపెనీ ఒకటి విశాఖలో రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమ, జీసీసీ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. రూ.6 వేల కోట్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు గురువారం విశాఖపట్నం రాగా.. జిల్లా అధికారులు వారికి పలు ప్రాంతాల్లో భూములు చూపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Amaravati to Become Financial Hub: ఆర్థిక హబ్‌ అమరావతి

Mixed Reactions to District Reorganization: ఇష్టం.. కొంచెం కష్టం

Updated Date - Nov 28 , 2025 | 06:35 AM