Amaravati to Become Financial Hub: ఆర్థిక హబ్ అమరావతి
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:12 AM
అమరావతికి ఇది కొత్త జోష్ రాజధానికి సరికొత్త కళ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడో, అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. శుక్రవారం ఒకే రోజు, ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి...
రాజధానికి రానున్న సంస్థలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఎల్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్
నేడు 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన
రాష్ట్రస్థాయి కార్యాలయాలు అమరావతిలో నిర్మాణం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన
పాల్గొననున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం
ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఎన్‌ఐఏసీఎల్‌తో పాటు
పలు బ్యాంకుల కార్యాలయాలు
కొలువుదీరనున్న 6,514 మంది ఉద్యోగులు
రాజధానిలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పనులు వేగవంతం
మూడు విభాగాలుగా 27.8 ఎకరాలు కేటాయింపు
సిబ్బంది నివాసాలకు 11.5 ఎకరాలు
గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అమరావతికి ఇది కొత్త జోష్! ‘రాజధాని’కి సరికొత్త కళ! ఇప్పటిదాకా ‘ఆంధ్రప్రదేశ్’లో ఎక్కడెక్కడో, అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. శుక్రవారం ఒకే రోజు, ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11.22 గంటలకు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు కూడా పాల్గొంటారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్థి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) తెలిపింది. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుదీరనున్నాయి.
చకచకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు
అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, ఇన్‌కంట్యాక్స్ వంటి పలు ప్రభుత్వ అనుబంధ ఆర్థిక కార్యాలయాలు ఇక్కడకు రానున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా సంస్థల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలకు అవసరమైన స్థలాల కేటాయింపుపై సీఆర్డీఏ దృష్టిపెట్టి చకచకా స్థలకేటాయింపును పూర్తి చేసింది.
కార్యాలయాలు, సిబ్బంది వసతికి స్థలం
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు స్థలాలను కార్యాలయాలు, సిబ్బంది వసతి, అనుబంధ సంస్థలు అనే మూడు విభాగాలుగా కేటాయించారు. బ్యాంకులు, కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం 9.695 ఎకరాలను ఇచ్చారు. ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, నాబార్డు, యూనియన్ బ్యాంకు సహా 12 బ్యాంకు లు ఈ స్థలంలో తమ కార్యాలయాలను నిర్మించుకోనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ), ఆదాయపు పన్నుశాఖ వంటి కీలకమైన సంస్థల కోసం 5.80 ఎకరాలు కేటాయించారు. సిబ్బంది వసతి, సంస్థాగత టౌన్‌షిప్ అభివృద్ధికి వీలుగా నివాస స్థలాలకు 7.02 ఎకరాలు, అనుబంధ సంస్థల ఉద్యోగుల నివాసాలకు 4.54 ఎకరాలు, మొత్తంగా 11.56 ఎకరాలు నివాసస్థలాలను కేటాయించారు. మొత్తంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటులో భాగంగా అమరావతిలో 27.855 ఎకరాల స్థలం కేటాయించారు.
సీఎంతో నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వక భేటీ
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుతో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిన్నర్‌కు సీఎం ఆహ్వానించడంతో ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిర్మాణాల వివరాలు ఇలా..
ఉద్దండరాయునిపాలెంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ బ్యాంకు రూ. 256 కోట్లతో భవనాలు నిర్మిస్తుంది. ఈ కార్యాలయంలో 1,000 మందికి ఉపాధి రానుంది.
వెలగపూడి, ఉద్దండరాయునిపాలెంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 40 కోట్లతో నిర్మిం చే కార్యాలయంలో 300 ఉద్యోగాలు కల్పిస్తుంది.
రాయపూడిలో ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) రూ. 200 కోట్లతో నిర్మించే కార్యాలయంలో 400 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఉద్దండరాయునిపాలెంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 40 కోట్లతో కార్యాలయం నిర్మిస్తుంది. 200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఉద్దండరాయునిపాలెంలో కెనరా బ్యాంక్ రూ. 50 కోట్లతో భవనాలు నిర్మించి 300 ఉద్యోగాలు ఇస్తుంది.
లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెంలో ఎస్‌బీఐ రూ. 300 కోట్లతో భవనాన్ని నిర్మిస్తుంది. 2 వేల ఉద్యోగాలు కల్పిస్తుంది.
ఉద్దండరాయునిపాలెంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 కోట్లతో కార్యాలయం నిర్మించి 160 ఉద్యోగాలు ఇస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్దండరాయునిపాలెంలో రూ. 60 కోట్లతో భవనాన్ని నిర్మిస్తుంది. 300 ఉద్యోగాలు కల్పిస్తుంది.
ఉద్దండరాయునిపాలెంలో ఇండియన్ బ్యాంక్ రూ. 40 కోట్లతో కార్యాలయం నిర్మించి 105 ఉద్యోగాలు ఇస్తుంది.
నాబార్డ్ ఉద్దండరాయునిపాలెంలో 90 కోట్లతో కార్యాలయం నిర్మిస్తుంది. 160 మంది ఇక్కడ కొలువులు చేయనున్నారు.
ఉద్దండరాయునిపాలెంలో కార్యాలయాలు నిర్మించే వాటిలో.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 15 కోట్లతో 150 ఉద్యోగాలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ. 10 కోట్లతో 100 ఉద్యోగాలు, ఐడీబీఐ బ్యాంక్ రూ. 50 కోట్లతో 215 మందికి ఉద్యోగాలు, ఎల్‌ఐసీ రూ. 22 కోట్లతో 1,036 ఉద్యోగాలు, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ రూ. 93 కోట్లతో 150 ఉద్యోగాలు కల్పించనున్నాయని సీఆర్డీఏ తెలిపింది.
నేడు నిర్మలా సీతారామన్‌ను కోరనున్న సీఎం చంద్రబాబు
పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు, అలాగే పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. రాజధానిలో ఆర్థిక సంస్థల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి వెలగపూడి సచివాలయానికి వస్తారు. ఈ సందర్భంగా ఆమెతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులతో కలసి ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సమావేశంలో పోలవరం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ను పూర్తి చేసేందుకు, పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్సుగా నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజె క్టు ప్రాథమిక అంచ నా వ్యయం రూ. 58,700 కోట్లుగా పేర్కొన్నారు. ఈప్రాజెక్టు డీపీఆర్ తయారీకి గురువారం పత్రికా ప్రకటన ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:
AP High Court: ఏడాదిగా పెండింగులోనా?
Amaravati to Become Financial Hub: ఆర్థిక హబ్ అమరావతి