AP High Court: ఏడాదిగా పెండింగులోనా?
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:05 AM
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై శాసన మండలి చైర్మన్ మోషేను రాజు నిర్ణయం వెల్లడించకుండా ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంచడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది...
చట్టాలు చేసేవారు చట్టం కంటే అధికులేం కాదు
ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా లేఖపై 4 వారాల్లో విచారణ ముగించండి
మండలి చైర్మన్ మోషేన్ రాజుకు హైకోర్టు ఆదేశం
విచారణ ప్రక్రియను దుర్వినియోగంచేయడమే: న్యాయమూర్తి
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై శాసన మండలి చైర్మన్ మోషేను రాజు నిర్ణయం వెల్లడించకుండా ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంచడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచక్షణాధికారం పేరుతో సహేతుక సమయంలో నిర్ణయం వెల్లడించకపోవడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టంచేసింది. 33వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. చట్టసభలకు ఎన్నికైన సభ్యుడు రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం.. దానిపై విచారణ జరిపి కనీసం 15 రోజుల్లో.. గరిష్ఠంగా నెల రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వెల్లడించాల్సిన బాధ్యత స్పీకర్/చైర్మన్‌పై ఉందని తేల్చిచెప్పింది. పిటిషనర్ విషయంలో మండలి చైర్మన్ చర్య సదరు సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని.. నిర్ణయం వెల్లడించేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. పదవికి రాజీనామా చేస్తూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన లేఖపై విచారణను నాలుగువారాల్లో ముగించి నిర్ణయం వెల్లడించాలని చైర్మన్‌ను ఆదేశించింది. అనంతరం ఆ నిర్ణయాన్ని పిటిషనర్‌కు తెలియపరచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ గత ఏడాది నవంబరు 23న మండలి చైర్మన్‌కు లేఖ సమర్పించానని.. దానిపై నిర్ణయం వెల్లడించేలా ఆయన్ను ఆదేశించాలని కోరుతూ జయమంగళ వెంకటరమణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామా లేఖ సమర్పించి ఏడాది (అప్పటికి 9 నెలలు) గడుస్తున్నా ఇప్పటివరకు దానిని ఆమోదించడం గానీ, తిరస్కరించడం గానీ చేయలేదన్నారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 186వ నిబంధన.. అధికరణ 190(3)బీ ప్రకారం రాజీనామా సమర్పించాక దానిని ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత చైర్మన్‌పై ఉందని తెలిపారు. వ్యాజ్యంపై గతంలో విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలులో జాప్యం జరగడంతో చైర్మన్‌కు అప్పట్లోనే కోర్టు రూ.10 వేల ఖర్చులు విధించింది. ఆ తర్వాత జరిగిన విచారణలో వాదప్రతివాదనలు విన్నాక న్యాయమూర్తి తన తీర్పును రిజర్వుచేశారు. గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు.
ఏడాది తర్వాత నోటీసు ఇస్తారా?
రాజీనామా స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా చేశారో లేదో విచారణ జరిపే అధికార పరిధి చైర్మన్‌కు ఉందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ఆయనకున్న అధికారాన్ని న్యాయస్థానం నిరోధించడం లేదని పేర్కొంది. ‘జయమంగళ రాజీనామా లేఖ సమర్పించి ఏడాది గడిచిన తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడేందుకు శుక్రవారం (ఈ నెల 28) తన ముందు హాజరుకావాలని సెప్టెంబరు 8న చైర్మన్ ఆయనకు నోటీసులు జారీ చేయడం సహేతుకం, సమర్థనీయం కాదు. విచక్షణాధికారం పేరుతో చైర్మన్ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేశారు. రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టేలా వ్యవహరించడం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. చట్టం చేసేవారు చట్టానికన్నా అధికులు కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను పరిశీలిస్తే మండలి చైర్మన్‌కు రాజ్యాంగపరమైన రక్షణ, సంపూర్ణ విచక్షణాధికారం లేదని కోర్టు భావిస్తోంది. చైర్మన్ సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వెడ్నె్‌సబరీ సూత్రానికి, అధికరణ 14కి విరుద్ధం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.