Share News

NRI Medical Student Suicide: ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:33 AM

ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలలో చదువుతున్న ప్రవీణ్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు డీన్‌ మరియు వైస్‌ ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు

NRI Medical Student Suicide: ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

  • డీన్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థుల ఆరోపణ

తగరపువలస/భీమునిపట్నం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా సంగివలస ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో శనివారం ఒక విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతికి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, డీన్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భీమిలి ఇన్‌చార్జి సీఐ శ్రీధర్‌ కథనం మేరకు.. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన పుస్తకాల వ్యాపారి రామదత్త రాజేశ్వరరావు, ఉమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్‌ (24) ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. శనివారం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకు మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రెడ్డి ప్రవీణ్‌ను పట్టుకున్నారు. ఆన్సర్‌ షీటు తీసుకుని, కళాశాల డీన్‌ సుధాకర్‌ వద్దకు తీసుకువెళ్లారు. ఆన్సర్‌ షీటు ఇవ్వాల్సిందిగా ప్రవీణ్‌ కోరినా, వారు అంగీకరించపోవడంతో అందరూ చూస్తుండగానే భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు కళాశాలను సందర్శించి విద్యార్థి మృతిపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. ప్రవీణ్‌ ఆత్మహత్యకు కళాశాల డీన్‌ సుధాకర్‌ వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి ప్రవీణ్‌ తల్లిదండ్రులు శనివారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. విద్యార్థులతో కలిసి వారు భీమిలి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు.

Updated Date - Apr 20 , 2025 | 04:35 AM