Share News

IT Growth: టెక్‌ హబ్‌గా విశాఖ

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:20 AM

విశాఖపట్నం ఫ్యూచర్‌ నాలెడ్జ్‌ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌...

IT Growth: టెక్‌ హబ్‌గా విశాఖ

  • నాలెడ్జ్‌ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుంది.. కాగ్నిజెంట్‌ శంకుస్థాపన సభలో సీఎం

  • గ్రీన్‌ ఎనర్జీ వల్లే డేటా సెంటర్లు వస్తున్నాయి

  • 99 పైసలకే భూములివ్వడం గేమ్‌ చేంజర్‌

  • కాగ్నిజెంట్‌ ముఖ్యుల్లో ఎక్కువ మంది తెలుగువారు కావడం గర్వకారణం

  • అన్ని విధాలా విశాఖ ఉత్తమ నగరం

  • కాగ్నిజెంట్‌ ప్రధాన కేంద్రం ఏపీకి రావాలి

  • పెట్టుబడులకు ఆ సంస్థ సీఈవో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలి: సీఎం

  • మంత్రి లోకేశ్‌తో కలసి కాగ్నిజెంట్‌, మరో 8 సంస్థలకు శంకుస్థాపన

  • కాగ్నిజెంట్‌ రాక ఓ మైలురాయి: లోకేశ్‌

విశాఖపట్నం పర్యాటకంగానే కాకుండా టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో కాగ్నిజెంట్‌ తన ప్రధాన కార్యాలయం ఏపీకి మార్చుకునేంతగా ఇక్కడ అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ఆ సంస్థలో అమెరికన్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ తదితర ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా తెలుగువారు కావడం గర్వకారణం.

పరిశ్రమలు తీసుకొస్తే ఉత్తరాంధ్రలో వలసలు పూర్తిగా నిలిచిపోతాయి. అవసరానికి మించి డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించవద్దు. ఐటీ, ఏఐ సంస్థలకు అధికారులు అధిక ప్రాధాన్యమివ్వాలి.విభిన్న పంటల సాగుకు విశాఖ రీజియన్‌ ఎంతో అనుకూలం. ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తూనే అంతర పంటలుగా కోకో, అరటి, మిరియాలు వంటివి పండించేలా చూడాలి. ఏజెన్సీలో మసాలా దినుసులు, స్ర్టాబెర్రీ సహా అన్ని పంటలూ పండించేందుకు అవకాశముంది.

- సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఫ్యూచర్‌ నాలెడ్జ్‌ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కాగ్నిజెంట్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో ఐటీ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ పుష్కలంగా ఉండడం వల్ల డేటా సెంటర్లు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఒక్క గూగుల్‌ డేటా సెంటరే రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు.


కాగ్నిజెంట్‌లో ఉన్నత స్థానంలో ఉన్న వారు తెలుగువారు కావడం మనకందరికీ గర్వకారణమని అన్నారు. కాగ్నిజెంట్‌కు 99 పైసలకే భూమి కేటాయించామని, ఇది గేమ్‌చేంజర్‌గా మారిందని పేర్కొన్నారు. గుజరాత్‌లో టాటా నానోకార్ల తయారీ ప్లాంటుకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని, లోకేశ్‌ సూచన మేరకు తాము కూడా అదే ధరకు భూమి ఇచ్చామని వెల్లడించారు. కాగ్నిజెంట్‌ ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసిందని చెప్పారు. ఇప్పుడు 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు 75 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, దానికి మించి విశాఖపట్నంలో లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అవసరమైనవన్నీ తాము సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్‌ సీఈఓ రవికుమారే ఏపీ తరఫున పెట్టుబడులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాలని కోరారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


విశాఖలో జీవన వ్యయం తక్కువ

‘‘దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖపట్నం మోస్ట్‌ లివబుల్‌, మోస్ట్‌ హ్యాపినింగ్‌ సిటీ. కాగ్నిజెంట్‌ కంటే ముందు సత్వా, ఫ్లూయెంట్‌ గ్రిడ్‌, క్వార్క్‌, ఏసీఎన్‌, మదర్‌సన్‌, ఇమాజిన్నోటివ్‌ తదితర ఎనిమిది సంస్థలకు శంకుస్థాపనలు చేశాం. ఇక్కడ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ 20 శాతం తక్కువ. ఇతర నగరాల్లోలాగా ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవు. భోగాపురంలో వచ్చే ఏడాది విమానాశ్రయం ప్రారంభిస్తున్నాం. మెట్రో రైలు కూడా వస్తుంది. రక్షణపరంగా చూసుకుంటే తూర్పు నౌకాదళం ఉంది. ఇప్పటికే 150 టెక్‌ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. 2032 నాటికి 135 బిలియన్‌ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని నీతి ఆయోగ్‌ విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ ద్వారా యత్నిస్తోంది. మరో ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తుంది. రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ల ద్వారా స్టార్ట్‌పలను ప్రోత్సహిస్తున్నాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ప్రత్యేకంగా హెల్త్‌ రికార్డులు నిర్వహిస్తున్నాం. 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్‌ ప్రతినిధులు రాజేశ్‌, సూర్య, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ చైర్మన్‌ ఎం.రామరాజు, ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి


  • విశాఖలో 25 వేల ఉద్యోగాలు ఇస్తాం

  • ఇక్కడికి రావడానికి ఉద్యోగుల్లో ఉత్సాహం నాది శ్రీకాకుళం ప్రాంతమే

  • కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ వెల్లడి

విశాఖపట్నానికి గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను రప్పిస్తాం. తద్వారా ఈ సిటీని జీసీసీ కేపిటిల్‌గా మారుస్తాం. విశాఖపట్నంలో మూడు దశల్లో ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేశాం. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఆ సంఖ్యను 25 వేలకు పెంచుతున్నాం. నా తల్లి, గ్రాండ్‌ పేరెంట్స్‌, సోదరుడు అంతా విశాఖలోనే ఉంటున్నారు. నేను శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడిని. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. విశాఖపట్నంలో పనిచేయడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో చెప్పాలని కోరితే.. 4,500 మంది ఉద్యోగులు సమ్మతి తెలియజేశారు. ఇంత స్పందన మేం ఊహించలేదు. ఇక్కడ మేం నేరుగా కల్పించే ప్రతి ఉద్యోగం ద్వారా పరోక్షంగా మరో నలుగురికి ఉపాధి కలుగుతుంది.


  • విశాఖలోనే ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు: లోకేశ్‌

  • ఈ కంపెనీల సీఈవోలను నేను ఎప్పుడూ కలవలేదు

  • భూములిచ్చిన 24 గంటల్లోనే శంకుస్థాపన చేశాం

ఒక్క విశాఖపట్నంలోనే ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. శుక్రవారం విశాఖలో ఎనిమిది కొత్త ఐటీ కంపెనీలకు శంకుస్థాపన అనంతరం కాగ్నిజెంట్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ ఏడాది జనవరిలో దావోస్‌ పర్యటన సందర్భంగా కాగ్నిజెంట్‌ ప్రతినిధులను కలిసి విశాఖలో కార్యాలయం పెట్టాలని కోరాను. అనేక చర్చల అనంతరం వారు అంగీకరించారు. మళ్లీ దావోస్‌కు వచ్చేలోగా కార్యాలయం ప్రారంభించాలని వారికి చెప్పాం. మళ్లీ జనవరి రాక ముందే విశాఖలో కార్యాలయం ప్రారంభించారు. ఇదో గేమ్‌ చేంజర్‌. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే.. చాలామంది వై వైజాగ్‌? అంటున్నారు. మేము మాత్రం వై నాట్‌ వైజాగ్‌?.. అని వారిని ఒప్పిస్తున్నాం. ఇందులో క్విడ్‌ప్రోకో ఏమీ లేదు. విశాఖకు కాగ్నిజెంట్‌ రాక ఒక మైలురాయి. వారికి కేటాయించిన భూమిలో నిర్మాణం చేపడుతూనే మరోచోట వేయి మందితో ఇంటెరిమ్‌ సెంటర్‌ను ప్రారంభించడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తే.. పరిశ్రమలు వస్తాయా? అని సీఎం చంద్రబాబు నన్ను ప్రశ్నించారు. ఇది గేమ్‌చేంజర్‌ అవుతుందని చెప్పి ఒప్పించాం. ఈ రోజు ఎనిమిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు చేశాం. వాటి సీఈఓలు ఎవరో నాకు ఇప్పటివరకూ తెలియదు. గతంలో కలవలేదు. గురువారం మంత్రివర్గ సమావేశంలో భూములు కేటాయించి, 24 గంటలు తిరగకుండానే వాటికి భూమి పూజ చేశాం. విశాఖపట్నం ఐటీ, జీసీసీల హబ్‌గా మారుతుంది. హైదరాబాద్‌ లాగానే విశాఖ కూడా అభివృద్ధి సాధిస్తుంది. కాగ్నిజెంట్‌ భవనాన్ని ఏడాదికల్లా పూర్తిచేయాలి. దానికి పూర్తి సహకారం అందిస్తాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అంతకుముందు లోకేశ్‌ ఐటీ సెజ్‌ హిల్‌-3పై కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో లోకేశ్‌ మాట్లాడారు. యువతే టార్చ్‌ బేరర్స్‌ అని, కష్టపడి విజయం సాధించాలని సూచించారు.

Updated Date - Dec 13 , 2025 | 06:59 AM