Venkaiah Naidu: దేశాభివృద్ధికి యువత కార్యోన్ముఖులు కావాలి: వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:38 PM
నేటి యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
కడప, నవంబర్ 1: నేటి యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దేశం బలోపేతం కావాలంటే, యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. మన మహనీయులు, ముఖ్యంగా నవభారత నిర్మాత సర్దార్ పటేల్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
యువత తమ వ్యక్తిత్వాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి యోగి వేమన బోధనలు మార్గదర్శకాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సరళమైన పదాలతో పద్యాల ద్వారా ఆయన బోధించిన జీవిత సత్యాలను ఆకళింపు చేసుకుంటే ఉన్నతమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని దిశానిర్దేశం చేశారు. యువత మాతృభాష, భారతీయ సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా ఇవాళ కడపకు వెళ్లిన ఆయనకు.. ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జేసీ అదితి సింగ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu: ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు: సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి