Vallabhaneni Vamsi Health: వంశీకి అస్వస్థత
ABN , Publish Date - May 25 , 2025 | 05:38 AM
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయిన వంశీ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరయ్యారు; ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం
అనంతరం నూజివీడు కోర్టులో హాజరు
అక్కడా వైద్య పరీక్షలు చేయించిన జడ్జి
ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న వైద్యులు
మళ్లీ విజయవాడ జైలుకు తరలింపు
విజయవాడ/నూజివీడు, మే 24(ఆంధ్రజ్యోతి): నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు. కస్టడీలో భాగంగా పోలీసులు వంశీని కంకిపాడు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వాంతు లు చేసుకోవడంతో పీహెచ్‌సీకి తరలించారు. శనివారం ఉదయం వరకు వైద్యం అందజేశారు. తర్వాత స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణకు సిద్ధమవుతుండగా, మళ్లీ వాంతులయ్యే సూచనలు ఉన్నాయని వంశీ చెప్పారు. దీంతో ఆయన్ను పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, నీరసంగా ఉండడం వల్ల వాంతులు అయినట్టు తెలిపారు. దీంతో పోలీసులు రెండో రోజు వంశీని విచారించకుండానే కోర్టులో హాజరుపరిచారు.
బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇళ్లపట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను నూజివీడు కోర్టు ఈనెల 26 కు వాయిదా వేసింది. వంశీని కస్టడీకి తీసుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఆయన చేతికి ఉన్న కాన్యులాను జడ్జి గమనించారు. నూజివీడు ఏరియా ఆసుపత్రి వైద్యులను పిలిపించి వంశీ ఆరోగ్యంపై వివరణ కోరారు. ఆయనకు నీరసం తప్ప మిగతా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. కాన్యులాను తొలగించి ప్లాస్టర్ వేశారు. అనంతరం పోలీసులు వంశీని విజయవాడ జైలుకి తరలించారు.