Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కష్టాలు కొని తెచ్చుకున్నారా? వైసీపీ హయాంలో ఆయన ఏం చేశారు?
ABN , Publish Date - Feb 13 , 2025 | 08:56 AM
వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు.

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆయనను తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Vallabhaneni Vamsi arrest)
అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు. 2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరిపోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీని టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహించింది. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ప్లేటు ఫిరాయించారు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీ నేతగా వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత, మంత్రి లోకేష్‌పై అడ్డూ అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. అఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలే కాకుండా, సామాన్య ప్రజలు కూడా వంశీ తీరును తప్పు పట్టారు.
2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందనే ధీమాతో వంశీ నియోజకవర్గంలో అరాచకాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే అయ్యుండి టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. అలాగే నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే నిరాశతో వెనుదిరిగారు. అప్పట్నుంచి అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. పలు కేసుల్లో నిందితుడు అయిన వంశీ గురించి ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు గురువారం ఉదయం ఆయణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..