AP Health Scheme: అందరికీ ఆరోగ్యమస్తు
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:21 AM
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ధీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ...
యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల బీమా కవరేజ్
రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి
3,257 చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం
రూ.2.50 లక్షల వరకూ చెల్లించనున్న బీమా సంస్థలు
2.50 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి
ఉద్యోగులు, పెన్షనర్లు, ఏపీఎల్ ప్రజలకూ మేలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ధీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి గురువారం క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బీమా సౌకర్యంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా లభించనుంది. ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌లో రిజిస్టర్ అయిన 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఉచిత వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుంది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్), దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్నవారు, ఉద్యోగులు, జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల ప్రజలకూ 3,257 రకాల చికిత్సలు ఉచితంగా అందుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.63 కోట్ల కుటుంబాలు వారు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఏపీఎల్ ప్రజలు కలిసి 8.60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆరోగ్యబీమా లేకుం డా ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రభుత్వమే బీమా సదుపాయం కల్పించనుంది.
ఆర్థిక భారమే అయినా..
రాష్ట్రంలో ఉన్న 1.63 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల బీమాను కచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం పడుతుంది. దీనికోసం దాదాపు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి భారం లేకుండా ప్రజలందరికీ రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించడమే హైబ్రిడ్ విధానం లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందేవారిలో 95 శాతం మందికి రూ.2.50 లక్షలలోపే ఖర్చవుతోంది. మిగిలిన 5 శాతంలో 3 శాతం మందికి రూ.5 లక్షల లోపు, 2 శాతం మందికి రూ.15 లక్షల లోపు మాత్రమే ఖర్చవుతోంది. ఈ గణాంకాల ఆధారంగా ఆరోగ్యశాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 95 శాతం మందికి వైద్య ఖర్చు రూ.2.50 లక్షల్లోపే అవుతోంది కాబట్టి 1.63 కోట్ల కుటుంబాలకయ్యే రూ.2.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. రూ.2.50 లక్షలు దాటిన తర్వాత నుంచి రూ.25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత వైద్యం అందిస్తుంది. దీనికోసం ప్రతి కుటుంబానికీ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఎన్టీఆర్ వైద్య కార్డును కూడా అందిస్తుంది. మరోవైపు 5.14 లక్షల మంది ఉద్యోగులు, 2.99 లక్షల మంది పెన్షనర్లు కూడా హెల్త్ పాలసీ పరిధిలోకి వచ్చేస్తారు. ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులందిస్తుంది. అలాగే ఏపీఎల్ కుటుంబాల ప్రజలు కూడా దీని పరిధిలోకి వచ్చేస్తారు. వారికి కూడా 2.50 లక్షల వరకే బీమా సంస్థ భరిస్తుంది. మిగిలిన రూ.22.50 లక్షలకు ఎవరు భరోసా కల్పిస్తారన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆస్పత్రులకు కష్టమే...
యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ దీనివల్ల రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని ప్రజలంతా ఇన్సూరెన్స్ కిందకి వచ్చేస్తే ఆస్పత్రులకు నేరుగా బిల్లులు చెల్లించే వారే ఉండరు. ఇటు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటవెంటనే నిధులు విడుదల చేయకపోతే నష్టపోయేది ఆస్పత్రుల యాజమాన్యమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలు సిద్ధం చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold And Silver Rate: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Khairatabad Maha Ganapati: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి రావొద్దు..